
డీఎస్సీ–2025 మొత్తం పోస్టులు 16,347
ఇందులో ఎస్‌జీటీ 6,599, స్కూల్ అసిస్టెంట్లు 7,487, పీఈటీ 2
మరో 2,259 స్టేట్, జోనల్ పోస్టులు
నేటినుంచి మే 15 వరకూ ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు
మే 20న మాక్ టెస్ట్, మే 30 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు
సాక్షి, అమరావతి: దాదాపు 11 నెలలుగా మెగా డీఎస్సీ అంటూ అభ్యర్థులను ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం శనివారం రాత్రి ఎట్టకేలకు డీఎస్సీ–2025 షెడ్యూల్ విడుదల చేసింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎట్టకేలకు అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 16,347 పోస్టుల కోసం షెడ్యూల్ వెలువరించింది. ఇందులో ఎస్‌జీటీ 6,599, స్కూల్ అసిస్టెంట్ 7,487, పీఈటీ 2 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏపీఆర్‌ఎస్, ఏపీఎంఎస్, సాంఘిక, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి మరో 2,259 స్టేట్/జోనల్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను ఆదివారం ఉదయం 10 గంటల నుంచి విద్యా శాఖ వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. వివరాలకు https:// cse. ap. gov.in / https// apdsc. apcfss. in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.

షెడ్యూల్ ఇదీ
దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపు: నేటినుంచి మే 15వ తేదీ వరకూ
మాక్ టెస్ట్: మే 20 నుంచి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: మే 30 నుంచి
పరీక్షలు: జూన్ 6 నుంచి జూలై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: ప్రతి పరీక్ష పూర్తయిన రెండవ రోజున
అభ్యంతరాల స్వీకరణ: ప్రాథమిక కీ విడుదలైన 7 రోజుల వరకు
ఫైనల్ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు
మెరిట్ జాబితా: ఫైనల్ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల చేస్తారు
