
నీ అహంకార ధోరణి మార్చుకో
మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
శ్రీకాళహస్తి టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు
శ్రీకాళహస్తి: ‘అదృష్టం వల్లో.. పూర్వజన్మ సుకృతం వల్లో ఎమ్మెల్యే అయ్యావు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. హేయమైన నీ మాట తీరు మార్చుకో’ అంటూ టీడీపీ నాయకుడు, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఓటేరు కాలువపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు శుక్రవారం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాటల్లోనే.. ‘ఓటేరు కాలువ భూముల గురించి క్షుణంగా విలేకరుల సమావేశంలో తెలిపాను.
అయినా సుధీర్‌రెడ్డి రైతులు కడుపుకొట్టే విధంగా అసెంబ్లీలో ప్రసంగించడం బాధ కలిగించింది. మాపై సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు ఏదో ఒకటి చెప్పి కలరింగ్ ఇచ్చుకుంటున్నావని తెలిసింది. మొత్తం వివరాలతో వెళ్లి నువ్వు చేస్తున్న ఆగడాలను బయటపెడుతా. నీ కుటుంబానికి మూడు తరాలుగా అండగా నిలిచాను. నీకు అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యావు. అహంకార ధోరణితో తొమ్మిది నెలల్లో నువ్వు చేసిన అరాచకాలపై వంద పేజీల నివేదిక సీఎంకు అందజేస్తా. ఓటేరు భూముల విషయంలో రైతుల కడుపు కొట్టేవిధంగా నువ్వు చేస్తున్న దుష్పష్ప్రాన్ని మేము పక్కా ఆధారాలతో నిరూపిస్తాం.
డొనేషన్లు తీసుకుని గెలిచి ఎవరినీ పట్టించుకోవడం లేదు. నీ కుటుంబం పరువు, పేరు చెడగొడుతున్నావు. ఒకసారికే నీకు తోక వచ్చేస్తే నీ కుటుంబం కంటే ముందు 1982లో నేను పార్టీలో చేరాను. 9 నెలల నీ పాలన చూసిన తర్వాత బియ్యపు మధుసూదన్‌రెడ్డి వెయ్యి రెట్లు మేలు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విధంగా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. ఇక ప్రతి వారం పార్టీని, నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నీ బాగోతాలు కడిగేస్తా’. అంటూ విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య, గురుదశరథన్, ప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు.