మ్యారేజ్.. హైరేంజ్.. | Guests are welcomed with northern women at Godarolla weddings | Sakshi
Sakshi News home page

మ్యారేజ్.. హైరేంజ్..

Published Sat, Apr 26 2025 4:20 AM | Last Updated on Sat, Apr 26 2025 4:20 AM

Guests are welcomed with northern women at Godarolla weddings

గోదారోళ్ల పెళ్లిళ్లలో ఆధునిక పోకడలు  

ఉత్తరాది మహిళలతో అతిథులకు స్వాగతాలు 

విందు భోజనాల వడ్డన నుంచి పాన్‌ అందించే వరకూ మర్యాదలు 

ఖర్చుకు వెనుకాడని ఉమ్మడి జిల్లా వాసులు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పెళ్లిళ్లలో అడుగడుగునా ఆధునికత కనిపిస్తోంది. సామాన్య, మధ్యతరగతి వారు కూడా అప్పోసొప్పో చేసి చాలా ఆడంబరంగా వివాహాలు చేయడం పరిపాటిగా మారింది. పెళ్లిళ్లలో అనేక కొత్త తరహా పద్ధతులు వచ్చి చేరుతున్నాయి. వాటిని అందరూ ఆమోదించడం గమనార్హం. 

ఈవెంట్‌ ఆర్గనైజర్లు కూడా అందుకు తగినట్టుగా పెళ్లి సందడిలో కొత్త కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. పెళ్లి మంటపం, రిసెప్షన్, పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడిని తయారు చేయడం, సంప్రదాయంగా పంపే సారె.. తదితర వాటిలో ఆధునికతను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లలో ఉత్తరాది, విదేశీ భామలు సైతం సందడి చేస్తున్నారు.  

సాక్షి, అమలాపురం: ఆధునిక కాలంలో జరుగుతున్న పెళ్లిళ్లలో అనేక కొత్త పోకడలు వచ్చాయి. పెళ్లి పందిరి నుంచి విందు భోజనాల వరకూ అన్నింటిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. గతంలో జరిగే పెళ్లిళ్లలో తాటాకు పందిళ్లు, కొబ్బరి, మొగలి ఆకులతో తయారు చేసిన రకరకా­ల పువ్వులు, ఆవుపేడతో అలికిన పెళ్లి అరుగు, చుట్టూ ముత్యాల ముగ్గులు, బాజా భజంత్రీలు, సన్నాయి మేళాలు, సంప్రదాయ భోజనాలు, అతిథులకు పసుపు, కుంకుమలు పెట్టి రవికెలు అందించడం కనిపించేంది.

కొత్తదనం
1980 నుంచి గోదావరి పెళ్లిళ్లలో కొత్తదనం చోటు చేసుకుంది. టెంట్లు, షామియానాలు, పట్టు పరికిణీలు కట్టుకుని గులాబీలు ఇచ్చే పడుచు పిల్లలు, పన్నీరు జల్లే యంత్రాలు, మ్యూజికల్‌ నైట్‌లు, బ్యాండు మేళాలు, పచ్చి పువ్వుల మంటపాలు, పలు రకాల వంటలు, అతిథులకు వడ్డించే కేటరింగ్‌ కుర్రాళ్లు సందడి చేసేవారు.

ఆధునిక బాటలో.. 
గోదారోళ్ల పెళ్లిళ్లు 2020 నుంచి ఆధునిక బాట పట్టా యి. బాహుబలి సెట్టింగ్‌లు, డీజే సౌండ్‌లు, సినీ నేప థ్య గాయకులతో సంగీత విభావరి, పెళ్లికి ముందు ఉత్తరాది బారాత్, సంగీత్, హల్దీలు, అనేక రకాల వంటకాలు, ఉత్తరాది భామలతో బుల్లెట్‌ బండ్ల మీద ఊరేగింపులు, విదేశీ భామలతో వినూత్న స్వాగత సత్కా రాలు.. ఇలా ఆధునిక పుంతలు తొక్కు­తున్నాయి.

ఖర్చు అధికమే..
రష్యన్‌ కళాకారులు వివిధ రకాల ప్రదర్శనల కోసం ముంబై, ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు. వీరిని పెళ్లి ఈవెంట్‌కు తీసుకురావాలంటే పారితోషికంతో పాటు విమానం టికెట్లు కూడా ఇవ్వాలి. దీంతో ఒకేసారి విశా ఖ, రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో ఈవెంట్లు ఏర్పాటు చేసి, వీరిని రప్పిస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్‌ నుంచి వచ్చేవారు పెళ్లిళ్ల సీజన్‌లో వచ్చి స్థానికంగా ఉంటారు. వీరితో ఆయా రాష్ట్రాల సంప్రదాయ బ్యాండ్‌ కళాకారులను కూడా ఇక్కడి పెళ్లిళ్లకు తీసుకు వస్తున్నారు.

బుల్లెట్‌ బండ్లపై సందడి 
పెళ్లిళ్ల ఊరేగింపులో కూడా కొత్త ట్రెండ్‌ సాగుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌ యువతులు బుల్లెట్‌ బండ్ల మీద పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వెంట ఊరేగింపుగా వస్తున్నారు. తలపాగాలు ధరించి, సంప్రదాయ వస్త్రధారణతో బుల్లెట్లు నడుపుతూ దారి పొడవునా సందడి చేస్తున్నారు. అలాగే రష్యా, బ్రెజిల్‌ భామలు పెళ్లి, రిసెప్షన్‌ వేదికల వద్ద స్వాగత సత్కారా లు చేస్తున్నారు. విచిత్ర వస్త్రధారణతో ఆహూతుల ను అలరిస్తున్నా రు. 

వెస్ట్రన్‌ మ్యూజిక్‌కు లయబద్ధంగా డ్యాన్సులు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తున్నారు. పీకాక్, స్వాన్‌ వేషధారణలతో స్వాగతం పలుకుతున్నారు. వీరితో పాటు అతిథులకు ముంత లస్సీలు అందజేసే మరాఠీ మహిళలు, కేటరింగ్‌ చేసే ఒడిశా యువతులు, ప్రత్యేకంగా బాదంపాలు అందించే పశి్చమ బెంగాల్‌ మహిళలు, రకరకాల స్వీట్‌ పాన్‌లు అందించే నవాబులు ఇలా ప్రతి చోటా పెళ్లికి వచ్చేవారికి మర్యాదలు చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క ఈవెంట్‌కు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చవుతుందని అంచనా.

ఆత్మీయంగా ఉంటారు 
కోనసీమ జిల్లా ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. మా ప్రదర్శనలను ఉత్సాహంగా తిలకిస్తారు. మాతో సెల్ఫీలు తీయించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ పెళ్లిళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. – అలీనా, రష్యా

ప్రత్యేక గుర్తింపు
వివాహాల సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మా వేషాలను, ఊరేగింపులో బుల్లెట్‌ నడిపే తీరును చూసి ప్రజలు ఎంతో ముచ్చట పడతారు. ఈవెంట్ల కోసం రాజమహేంద్రవరం, కాకినాడ, కోనసీమ వచ్చినప్పుడు మాకు వచ్చే ఆనందం వేరు.   – దామినీ ఈషా, మహారాష్ట్ర  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement