
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.