
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా అవుకులో ఆదివారం అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్ జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
100కిపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలోని 31 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 20 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అకస్మాత్తుగా పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.