వచ్చే రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఇది వాయుగుండంగా మారి 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్యలో తీవ్ర అల్పపీడనంగా బలపడి, పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని చెప్పారు.
ఇది తీరాన్ని దాటిన అనంతరం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణించి బలహీనపడుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో శని, ఆది వారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. వాయుగుండం, భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment