
రాష్ట్రం నుంచి పారిపోతున్న పారిశ్రామికవేత్తలు
కూటమి నేతల బెదిరింపులతో బెంబేలు
వాటిని తట్టుకోలేక మూతపడుతున్న యూనిట్లు
తమ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు
జేఎస్‌డబ్ల్యూ నవీన్ జిందాల్‌పై అక్రమ కేసులు
దీంతో మన రాష్ట్రం వదిలేసి మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్న జేఎస్‌డబ్ల్యూ
రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్న అదానీ గ్రూపుపై పచ్చ పత్రికలతో విష ప్రచారం
అదానీ కృష్ణపట్నం పోర్టులో కప్పం కట్టాలంటూ సోమిరెడ్డి అనుచరుల దాడి
ఆర్టీపీఎస్ బూడిద లారీలు మాకంటే.. మాకంటూ.. బీజేపీ, టీడీపీ నేతల ఫైట్
మామూళ్ల కోసం శ్రీకాకుళం యూబీ బీర్ల లారీలను అడ్డుకున్న టీడీపీ నేతలు
సత్యసాయి జిల్లా గ్రీన్‌టెక్ రెడీమిక్స్‌లో వాటాలు డిమాండ్ చేస్తున్న మంత్రి
ఎమ్మెల్యే వేధింపులతో పల్నాడులో మూత పడిన చెట్టినాడ్, భవ్య సిమెంట్
అనకాపల్లి కోకోకోలా ప్లాంట్‌లో వాటాల కోసం జనసేన ఎమ్మెల్యే అరాచకం
రెడ్‌బుక్ రాజ్యాంగంతో బాబోయ్ ఏపీ అంటున్న పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: యునైటెడ్ బ్రూవరీస్, కోకోకోలా.. చాలా పెద్ద సంస్థలు. ఇలాంటి కంపెనీలే రాష్ట్రంలో కూటమి పార్టీల నేతల వసూళ్లు, ఒత్తిళ్లపై నేరుగా కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్ జిల్లాలో రూ.9 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విజయనగరంలో ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్‌ను కూటమి సర్కారు సినీ నటి కాదంబరి జత్వానినీ అడ్డుపెట్టుకుని కేసులు పెట్టి మరీ వేధిస్తోంది. దీంతో ఆ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆపేసి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీలో పోర్టులు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రూప్‌పై కూటమి పచ్చ పత్రికల ద్వారా విషం చిమ్మడంతో ఆ ప్రాజెక్టులు డోలాయమానంలో పడ్డాయి. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వద్ద అదానీ గ్రూప్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం చేపడితే తమకు కమీషన్లు ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్ది అనుచరులు గూండాగిరీ చేశారు.
ఆ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగి యంత్ర సామగ్రిని ధ్వంసం చేసి సిబ్బందిని గాయపర్చారు. అదానీ నిర్వహిస్తున్న కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే నేరుగా వెళ్లి దాడి చేశారంటే కూటమి నేతల బరితెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కొత్త పెట్టుబడులు తేవడం కంటే.. ఉన్న కంపెనీల్లో వాటాలు మామూళ్ల పైనే శ్రద్ధ..! శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో అందినంత వసూళ్లు..! వసూళ్ల వేధింపులు భరించలేక యూనిట్లకు తాళాలు వేసుకుని పోతున్నవారు కొందరు.. ఏకంగా పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న మరికొందరు..! వెరసి కూటమి సర్కారు కప్పం దెబ్బకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో ఏపీకో దండం అంటూ పారిపోతున్నారు.
కేంద్రానికే మొర
శ్రీకాకుళం జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీపై బీజేపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. కంపెనీకి వచ్చే ప్రతి లారీపై రూ.వెయ్యి చొప్పున నెలకు రూ.కోటిన్నర కప్పం కట్టాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేం అని చెప్పడంతో ఎమ్మెల్యే అనుచరులు కంపెనీపై దాడి చేసి ఉద్యోగులను చితకబాదారు. కంపెనీ ప్రతినిధులు ఈ వ్యవహారంపై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
» మామూళ్ల కోసం అనకాపల్లి జిల్లాలో ఉన్న కోకోకోలా ఫ్యాక్టరీపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ బెదిరింపులకు దిగడంతో ఆ కంపెనీ ప్రతినిధులు నేరుగా కేంద్రానికి, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.
» చెప్పుకొంటూ పోతే మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఎమ్మెల్యే తమ శక్తి మేరకు మామూళ్ల కోసం బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు.
కొత్తవి రాకపోయేసరికి పాతవి తమ ఖాతాలోకి
కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమై దావోస్ నుంచి ఉత్తి చేతులతో తిరిగొచి్చన సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. గత ప్రభుత్వంలో వచి్చన ప్రాజెక్టులను వారి ఖాతాలోకి వేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1,10,000 కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేసేలా 2023 విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. దాన్ని కూడా తామే
తీసుకొచ్చినట్లు బాబు, లోకేశ్ డప్పు కొంటుకుంటున్నారు.
» గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.పది లక్షల కోట్లకుపైగా గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటే కూటమి సర్కారు తమ ఖాతాలోకి వేసుకుంటోంది. కాకినాడ గ్రీన్‌కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ వంటి వాటినీ తమ ఘనతగానే చెప్పుకొంటున్నారు.
» వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశానికి వెళ్లి ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో పెట్టబడులకు ఒప్పించారు. అయితే, ఒక్కసారి కూడా నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్‌తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్‌ను తామే తీసుకొచ్చామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు.
మరికొన్ని చిలక్కొట్టుళ్లు
» రామాయపట్నం పోర్టు నిర్మాణ పనుల్లో తమకు వాటా ఇవ్వాలంటూ లారీలను అడ్డుకున్న కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
» తమ నియోజయోకవర్గం గుండా వెళ్లే గ్రానైట్ లారీలపై కప్పం కట్టాల్సిందేనని పల్నాడు, ప్రకాశం ఎమ్మెల్యేల హుకుం
» నంద్యాలలో పొగాకు గోదాంల దగ్గరనుంచి చికెన్ షాపుల వరకు కమీషన్లు
» కప్పం కడితేనే గనులకు లీజ్ ఇస్తుండటంతో 50 శాతం పడిపోయిన ఆ శాఖ ఆదాయం
» నెల్లూరు జిల్లాలో రొయ్యల ఫీడ్ తయారు చేసే వాటర్‌బేస్ కంపెనీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు తమకే ఇవ్వాలంటూ ఒత్తిడి
» కృష్ణపట్నం పోర్టు సమీపంలోని పామాయిల్ తయారీ యూనిట్ల నుంచి లారీ కదలాలంటే సొంత టోల్ ట్యాక్స్ చెల్లింపు
సిమెంట్ పరిశ్రమల్లో మరీ దారుణ పరిస్థితి
తాజాగా పల్నాడు జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలపై స్థానిక ఎమ్మెల్యేలు మామూళ్లు, వాటాలు అంటూ దందాకు దిగారు. ముడి సరుకు, సిమెంట్ సరఫరాను అడ్డుకోవడంతో చెట్టినాడ్ సిమెంట్, భవ్య సిమెంట్ సంస్థలు ఉత్పత్తిని నిలిపివేసి యూనిట్లకు తాళాలు వేసి వెళ్లిపోయాయి. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు.
» తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఒక తెలుగు చానల్‌ను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఆ సంస్థకు ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు చెందిన సున్నపురాయి సరఫరాను కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కార్యకలాపాలను నిలిపేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది.
» రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లే విషయంలో టీడీపీకి చెందిన జేసీ ప్రభాకరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బహిరంగానే బాహాబాహీకి దిగిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు మాకు కావాలంటే మాకు కావాలంటూ కొట్టుకోవడంతో పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.
» నంద్యాల జిల్లాకు చెందిన ఒక మంత్రి సిమెంట్ కంపెనీలకు ఎర్రమట్టి సరఫరాపై తమ పార్టీకే చెందిన నాయకుడితో గొడవకు దిగారు. దీంతో అ్రల్టాటెక్ సిమెంట్స్ బూడిద, మట్టి సరఫరా లేక ఇబ్బందులను ఎదుర్కొంది.
» సిమెంటు సరఫరా దందాలో ఎస్పీకి ఫిర్యాదు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేపైనే బీజేపీకి చెందిన ఎంపీ ఫైర్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
» శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మరో మంత్రి గ్రీన్ టెక్ రెడీమిక్స్ కంపెనీలో వాటాలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు.