
ప్రైవేటు కంపెనీ కోసం ప్రభుత్వం రాయబారం
విశాఖ స్టీల్‌కు సొంత గనుల గురించి కేంద్రాన్ని అడగని మంత్రి
ఆర్సెలర్ మిట్టల్‌కు సొంత గనులు కేటాయించాలని వినతి
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్
మిట్టల్ సొంత పోర్టు నిర్మాణం కోసం తాజా నిబంధనల్లో సవరణ
కాకినాడ గేట్ వే పోర్టుకు సమీపంలోనే మరో పోర్టు
డీఎల్ పురం వద్ద క్యాప్టివ్ పోర్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు సుదీర్ఘంగా పోరాడుతుంటే.. దాన్ని బతికించుకోవడానికి సొంత గనులు కేటాయించండని కోరని కూటమి సర్కారు.. ప్రైవేటు రంగంలో కొత్తగా ఉక్కు కర్మాగారం పెట్టబోతున్న నిస్సాన్ ఆర్సలర్ మిట్టల్ కంపెనీ కోసం మాత్రం రాయబారాలు నడుపుతోంది. ఆ సంస్థకు సొంతంగా గనులు కేటాయించండంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం అధికార వర్గాలను విస్మయ పరుస్తోంది.
ఒక ప్రైవేటు సంస్థకు సొంతంగా ముడి ఇనుము గనులు కేటాయించాలంటూ ఏకంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ అధికారుల బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఇటీవల కలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకపోగా, మిట్టల్ కోసం ఏకంగా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా ఏకపక్షంగా మార్చేస్తోంది.
ఏదైనా ఒక పోర్టు లేదా ఎయిర్‌పోర్టు నిర్మాణం చేస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఇన్ని కిలోమీటర్ల పరిధి వరకు మరో పోర్టు లేదా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వంతో కన్సెషన్ ఒప్పందం చేసుకోవడం సహజం. అదే విధంగా కాకినాడ సమీపంలోని కోన గ్రామం వద్ద కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్ 2018 నవంబర్ 21న కన్సెషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కాకినాడ గేట్‌వే పోర్టుకు 16 కిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి వాణిజ్య, క్యాప్టివ్ (సొంత అవసరాలకు) పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడానికి ఉండదు.
కానీ ఇప్పుడు ఆర్సలర్ మిట్టల్ ఏర్పాటు చేసే ఉక్కు కర్మాగారం కోసం క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతి కోరడం, దీనికి ప్రతిబంధకంగా ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు నిబంధనలను మార్చడం చకచకా జరిగిపోయింది.
కాకినాడ ఆర్థికాభివృద్ధిపై దెబ్బ
కాకినాడ గేట్‌వే పోర్టు ప్రారంభమై కాకినాడ సెజ్ అభివృద్ధి చెందితే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని స్థానికులు ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణ పనులు నెమ్మదించాయి. ఇప్పుడు ఏకంగా కన్సెషన్ ఒప్పందం కూడా మార్చడంతో పోర్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది కాకినాడ సెజ్‌పై తీవ్ర ప్రభావం చూపడవేంతోపాటు ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.
డీఎల్ పురం వద్ద క్యాప్టివ్ పోర్టుకు అనుమతి
అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద సముద్రపు ఒడ్డు నుంచి 2.9 కిలోమీటర్ల లోపు క్యాప్టివ్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అనుమతి, సరిహద్దులను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో ఉత్తర్వును జారీ చేసింది.