
ప్రీమియర్ ఎనర్జీస్‌కు రూ.1,573 కోట్ల ప్రోత్సాహకాలు
నాయుడుపేట సెజ్‌లో 106.6 ఎకరాలు కేటాయింపు
శ్రీ సత్యసాయి జిల్లాలో పెట్రా సిలికాన్‌కు 224.35, మీడియా మాట్రిక్స్ వరల్డ్ వైడ్‌కు 329 ఎకరాలు
రామ్‌కో సిమెంట్స్‌కు నంద్యాల జిల్లాలో 79.91 ఎకరాలు..
విజయనగరం జిల్లాలో మా మహామాయకు మరో 82.80 ఎకరాలు
ప్రొటేరియల్, స్నేహ ఫామ్స్, ఎల్‌జీ వెండర్స్, డిక్సన్, టాప్‌స్టోన్స్‌కు ప్రత్యేక రాయితీలు
ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్
సాక్షి, అమరావతి: పరిశ్రమలకు కారుచౌకగా భూములు, భారీ ప్రోత్సాహకాలు, రాయితీలను ప్రకటిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4,200.07 కోట్లతో నాయుడుపేట సెజ్‌లో 8 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ పీవీ సెల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్‌పై రాష్ట్ర ప్రభుత్వం అవ్యాజమైన ప్రేమను చూపింది. కేవలం 1,500 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తామని చెప్పిన ఈ యూనిట్‌కు ఏకంగా రూ.1,573 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు ఎకరం రూ.60 లక్షలు చొప్పున 106.6 ఎకరాలను కేటాయించింది.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద మీడియా మాట్రిక్స్ వరల్డ్ వైడ్ లిమిటెడ్ రూ.1,197 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి తొలి దశ యూనిట్ ఏర్పాటుకు ఎకరా రూ.7లక్షలు చొప్పున 329 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఈ భూములను ఎకరా రూ.21.95 లక్షలు చొప్పున సేకరించినప్పటికీ రూ.49.18 కోట్ల నష్టానికి మాట్రిక్స్ వరల్డ్ వైడ్‌కు భూములను కేటాయించింది. రెండో దశకు అవసరమైన 671 ఎకరాలను కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
మరికొన్ని సంస్థలకు ప్రోత్సాహకాలు, భూ కేటాయింపులు..
» విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఉన్న మా మహామాయ సంస్థ రూ.2,063 కోట్లతో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం రూ.797.96 కోట్ల రాయితీలు ప్రకటించింది. ప్రస్తుతం యూనిట్ ఉన్న ప్రాంతంలోనే మరో 82.80 ఎకరాలను ఏపీఐఐసీ సేకరించి ఇవ్వడానికి అనుమతించింది. ఈ భూమిలో 25.88 ఎకరాల్లో ఉన్న నీటి వనరులను ముందస్తు అనుమతులతో వినియోగించుకోవడానికి కూడా ఆమోదం తెలిపింది.
» శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.585.64 కోట్లతో ఇంటిగ్రేటెడ్ క్వార్ట్జ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న పెట్రా సిలికాన్‌కు 224.35 ఎకరాలను కేటాయించింది.
» నంద్యాల మండలం కోటపాడులో సుమారు రూ.478 కోట్లతో రామ్‌కో ఏర్పాటు చేస్తున్న సిమెంట్ పరిశ్రమకు 79.91 ఎకరాలను కేటాయించింది.
» తిరుపతి జిల్లా శ్రీ సిటీలో సుమారు రూ.1,055.55 కోట్లతో ప్రోటేరియల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్న ఆమ్రోఫస్ మెటల్ తయారీ యూనిట్‌కు రూ.237.71 కోట్ల రాయితీలతోపాటు ఇతర ప్రోత్సాహకాలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
» స్నేహ ఫామ్స్ రూ.459.97 కోట్లతో నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కోళ్ల దాణా, మొక్కజొన్న నిల్వ గోడౌన్లు, బాయిలర్ ఫామ్స్‌కు రూ.67.44 కోట్ల ప్రోత్సాహకాలకు అనుమతించింది.
» శ్రీ సిటీలో ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ వెండర్స్ ఏర్పాటు చేస్తున్న వివిధ యూనిట్లకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది.
» డిక్సన్ టెక్నాలజీస్ తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లకు సంబంధించి రూ.3.08 కోట్ల లీజ్ రెంటల్ అండ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ టైమ్ (ఈవోటీ) ఫీజును, టాప్‌స్టోన్ మెటల్స్‌కు సంబంధించి రూ.28.82 లక్షల ఈవోటీని రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.