
విజయవాడ జైలుకు తరలింపు
రిమాండ్ రిపోర్ట్‌పై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు
అవినీతి జరిగిందని ఊహించుకొని అరెస్ట్ చేశారా..?
సిట్ అధికారుల తీరుపై న్యాయమూర్తి అసహనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : మద్యం అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కేసిరెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అంతకు ముందు రిమాండ్ రిపోర్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం రాత్రి వాడివేడిగా వాదనలు జరిగాయి. అరెస్ట్‌లో సాంకేతిక తప్పిదాల గురించి నిందితుడి తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వ సలహాదారు పబ్లిక్ సర్వెంట్ ఎలా అవుతారని ప్రశ్నించారు.
పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్) యాక్ట్ అమలు విషయంలో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పబ్లిక్ సర్వెంట్ అని నిరూపించేందుకు పీపీ కల్యాణి ప్రయత్నించారు. ఐటీ సలహాదారుగా పని చేసి ప్రభుత్వం నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో కేరళ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉటంకించారు. అయితే రాజ్ పబ్లిక్ సర్వెంట్ కాదని, అతనికి 17(ఎ) వర్తించదన్న డిఫెన్స్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఈ విషయంలో న్యాయస్థానానికి మరింత స్పష్టత ఇవ్వాలని ప్రాసిక్యూషన్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అవినీతి జరిగింది.. ఇప్పటి వరకు ఎంత నగదు, ఆస్తులు, ఇతర సామగ్రి సీజ్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. నగదు, ఆస్తులు వంటివి ఏమీ సీజ్ చేయలేదని చెప్పారు. ఈ సమాధానం విన్న న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. గత ఏడాది సెపె్టంబర్‌లో నమోదు చేసిన కేసుకు సంబంధించి.. సిట్ ఏర్పాటై, ఇన్ని నెలల దర్యాప్తు చేశాక.. ఎలాంటి నగదు, ఆస్తులు, వస్తువులు సీజ్ చేయనపుడు.. అవినీతి చేశాడంటూ అభియోగం ఎలా మోపుతారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కేవలం రూ.3,200 కోట్లు అవినీతి జరిగిందని ఊహించుకుని అరెస్ట్ చేసి, రిమాండ్ కోసం కోర్టుకు తీసుకొచ్చారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హవాలా రూపంలో సెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడు దర్యాప్తునకు సహకరించడం లేదని, అందుకే రిమాండ్ అడుగుతున్నామని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
గంట ముందు న్యాయస్థానానికి మెమో
కేసు కోర్టుకు అటాచ్ చేసే అంశంలో ప్రాసిక్యూషన్ ఇచ్చిన మెమోను న్యాయస్థానం తప్పు పట్టింది. దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్యాణి ఇచ్చిన పొంతనలేని సమాధానాలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అవినీతి నిరూపణ కానప్పుడు కేసును సీఐడీ దర్యాప్తు చేయాలని, సీఐడీ కోర్టులోనే విచారణ జరగాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఏసీబీ కోర్టుకు అటాచ్ చేయాల్సి వచ్చినపుడు మెమో ఎప్పుడిచ్చారంటూ ప్రశ్నించారు. సాయత్రం నాలుగు గంటలకు మెమో ఇస్తే.. విచారణ ఎప్పుడు చేయాలని నిలదీశారు.
అయితే ఉదయమే మెమో ఇచ్చామని పీపీ చెప్పడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. మెమో షీట్‌పై సమయం వేసి ఉన్నప్పటికీ, అందుకు భిన్నంగా ఎలా మాట్లాడతారంటూ అసహనం వ్యక్తం చేశారు. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ అయితే అతని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారా? ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ అధికారినైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారా? అన్న న్యాయమూర్తి ప్రశ్నలకు ప్రాసిక్యూషన్ సరైన సమాధానం కరువైంది.
కనీసం కోర్టుకు మెమో ఇచ్చే అంశంలోనే స్పష్టత లేనపుడు ఈ కేసు వాదనలకు ఆధారం ఎక్కడుంటుందని, వెంటనే మెమోను వెనక్కి తీసుకుంటే కేసును సీఐడీ కోర్టుకు రిటర్న్ చేస్తామని, పై అధికారులతో మాట్లాడుకుని ఏ విషయం చెప్పాలని న్యాయమూర్తి అసహనంగా బెంచ్ దిగి వెళ్లిపోయారు.

ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ ఎలా?
న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించిన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు రాజ్ కేసిరెడ్డి పేరు లేకపోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేని వ్యక్తిని నిందితుడు అంటూ ఎలా అరెస్ట్ చేశారని, రిమాండ్ ఎలా అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు.
కోర్టు నియమాలను అనుసరించాలని సుప్రీంకోర్టు, తాము ఎన్నిసార్లు చెప్పినా మీలో మార్పు రావడం లేదని విచారణ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశామని, ఏ3గా ఉన్న నిందితుడు విచారణకు ఏ మాత్రం సహకరించట్లేదని, పూర్తి స్థాయిలో కస్టడికి తీసుకుని విచారణ చేయాల్సి ఉందని పీపీ న్యాయస్థానాన్ని కోరారు.
తప్పుల తడకగా రిమాండ్ రిపోర్ట్
విచారణ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌పై ప్రాసిక్యూషన్ సైతం అసహనం వ్యక్తం చేసింది. కోర్టుకు ఇచ్చిన మెమో విషయంలో సిట్ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి బెంచ్ దిగి వెళ్లిపోవడంతో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హుటాహుటిన కోర్టు హాల్‌కు చేరుకున్నారు. కోర్టుకు ఇచ్చిన మెమో, 17(ఎ), ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి పేరు నమోదు చేయక పోవడం వంటి అంశాలను తిరిగి లేవనెత్తారు.
కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌ను సక్రమంగా చదవాలని న్యాయమూర్తి సూచించడంతో కొన్ని పేరాలను ఏజీ దమ్మాలపాటి చదివేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పులను గమనించి విచారణ అధికారులైన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిమాండ్ రిపోర్ట్‌ను పక్కన విసిరారు. కేసులో సరైన ఆధారం లేకుండా, ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తామంటూ పోలీసులపై మండిపడ్డారు. కనీసం పేరాలు, పేజీ నంబర్లు లేకుండా రిపోర్ట్ ఎలా తయారు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణకు వస్తానని చెప్పినా..
ఈ కేసులో విచారణకు స్వచ్ఛందంగానే హాజరవుతానని, సిట్ అధికారులు నోటీసులో ఇచ్చిన తేదీనే విచారణకు వస్తానని చెప్పినా పోలీసులు తనను అరెస్ట్ చేశారంటూ నిందితుడు రాజ్ కేసిరెడ్డి కోర్టుకు వివరించారు. మంగళవారం కేసు విచారణకు హాజరయ్యే నిమిత్తం సోమవారం మధ్యాహ్నం గోవా నుంచి బయలుదేరి సాయంత్రానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని, అక్కడి నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేశారని చెప్పారు.
తన కారును సీజ్ చేశారని, బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారని, విచారణ పేరుతో తన తల్లి, తండ్రిని ఇబ్బందులు పెడుతున్నారని న్యాయమూర్తికి తెలిపారు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, అందులో తాను సంతకాలు చేయలేదని వివరించారు. కాగా, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు వెలువరించారు.