
రాత్రి 9.30 నుంచి తెల్లవారుజాము వరకు వాదనలు
పోసాని తరఫున వాదనలు వినిపించిన మాజీ ఏఏజీ పొన్నవోలు
డిఫెన్స్ వాదనలతో ఏకీభవించిన మెజిస్ట్రేట్.. ఎట్టకేలకు 111 బీఎన్‌ఎస్ సెక్షన్ తొలగింపు
ఇతరత్రా 15కు పైగా అక్రమ కేసులు.. అందుకే రిమాండ్
రాజంపేట సబ్ జైలుకు తరలింపు.. కోర్టు వద్ద ఉత్కంఠ
కడుపు నొప్పి, విరేచనాలతో బాధ పడుతున్న పోసాని
పోసాని న్యాయవాదులు బెయిల్ పిటిషన్.. పోలీసులు కస్టడీ పిటిషన్
సాక్షి, రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్/రాజంపేట రూరల్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. గురువారం రాత్రి 9 గంటలకు పోలీసులు కృష్ణ మురళిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. పదేళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై స్థానిక జనసేన నేత ఫిర్యాదు మేరకు ఆయనపై అక్రమ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోసాని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను ప్రస్తావిస్తూ, ఈ సెక్షన్లు ఆయనకు వర్తించవని వివరించారు. సంబంధం లేని సెక్షన్లతో పాటు అనవసర సెక్షన్లు పెట్టారని వాదించారు. ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఈ కేసుకు సంబం«ధించి తమ వాదనలు వినిపించారు. దాదాపు 9.30 గంటలకు ప్రారంభమైన వాదనలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ పరిణామాలపై కోర్టు బయట పోసాని అభిమానులతోపాటు వైఎస్సార్‌సీపీ నేతల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇరుపక్షాల వాదనలు ఆలకించిన మెజిస్ట్రేట్ సాయితేజ్.. తెల్లవారుజామున పోసానికి 14 రోజుల రిమాండును విధించారు. అనంతరం పోసానిని రైల్వేకోడూరు సీఐ పి.వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ పి.మహేష్‌నాయుడులు తమ సిబ్బందితో ఉదయం 7.52 గంటలకు నేరుగా రాజంపేట సబ్ జైలు వద్దకు తీసుకొచ్చారు. జైలులో ఆయనకు 2261 నంబరు కేటాయించారు. ఇదే సమయంలో జిల్లా జైళ్ల శాఖ ఉప అధికారి హుస్సేన్‌రెడ్డి ఈ జైల్‌ను సందర్శించారు.
న్యాయ పోరాటం చేస్తాం : పొన్నవోలు
పోసానికి రిమాండు విధించిన అనంతరం కోర్టు నుంచి బయటికి వచ్చిన పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ఆయన వెంట మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నేత జల్లా సుదర్శన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.
బెయిల్ కోసం దరఖాస్తు
పోసాని కృష్ణ మురళీకు బెయిల్ కోసం రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాది నాజ్జాల మధు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సోమవారం వాదనలు వినిపించనున్నారు. రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఓబులవారిపల్లి ఎస్‌ఐ మహేష్‌లు పోసాని విచారణ నిమిత్తం కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళి ఆరోగ్యం క్షీణించిందని ఆయన స్నేహితులు లింగంగుట్ల సల్మాన్‌రాజ్, షేక్ నాగూర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు.
రాజంపేట సబ్ జైల్‌లో శుక్రవారం ములాఖత్ సమయంలో వారు పోసానిని కలిశారు. అనంతరం సబ్ జైల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గంటల కొద్దీ ప్రయాణం చేయటం వల్ల పోసాని అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. రెండు రోజులుగా విశ్రాంతి లేకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు. పోసాని కడుపు నొప్పి, విరేచనాలతో బాధ పడుతున్నారని తెలిపారు. తాము టాబ్లెట్లు ఇవ్వబోగా.. తమ డాక్టర్ ఉన్నారని జైలర్ అభ్యంతరం తెలిపారన్నారు.
పోసానిపై 111 సెక్షన్ తొలగింపు
రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై అక్రమంగా 15కు పైగా కేసులు బనాయించారని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పాటూరు భరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోసాని మీద 111, ఆర్/డబ్ల్యూ3(5) ఆఫ్ బీఎన్‌ఎస్, 196, 35(2), ఐటీ 67 యాక్ట్–2023 ప్రకారం అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.
ఈ రిమాండ్ అక్రమమని, దీనికి ఈ సెక్షన్‌లు ఏ మాత్రం వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు డిఫెన్స్ వాదనలతో ఏకీభవించి 111 బీఎన్‌ఎస్ అనేది తీవ్రమైన సెక్షన్ అని భావించి, అది ఈ కేసులో వర్తించదని తొలగించిందని తెలిపారు. 111 సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్‌లు అన్నీ బెయిలబుల్ అఫెన్స్ మాత్రమేనన్నారు. ఈ కేసులే కాకుండా ఇంకా చాలా కేసులు ఉండటం వల్ల కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment