
అన్ని రాష్ట్రాల్లో కలిపి 554 వేడిరోజులు నమోదు
రాయలసీమలో 16 రోజులు... తెలంగాణలో 12 రోజులు
2023లో 230... 2022లో 467 నమోదు
2022లో వడదెబ్బకు 730మంది మృతి
కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ గర్భ శాస్త్రాల మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో గతేడాది వడగాడ్పుల రోజుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 2024లో 554 వేడి రోజులు నమోదైనట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ గర్భ శాస్త్రాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో దేశంలో 467 వేడి గాలుల రోజులు నమోదుకాగా 2023లో 230 నమోదైనట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023లో రాయలసీమలో ఒక్కరోజు మాత్రమే వేడి గాలులు నమోదుకాగా, 2024లో 16 రోజులు నమోదైనట్లు పేర్కొంది. తెలంగాణలో 2023లో 14 రోజులు, 2024లో 12 రోజులు వేడి గాలులు నమోదైనట్లు పేర్కొంది.
గతేడాది అత్యధికంగా ఒడిశాలో 37 రోజులు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో 33 రోజులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో 32 రోజులు, బిహార్‌లో 30 రోజులు, పశ్చిమ రాజస్థాన్‌లో 29 రోజులు వేడి గాలులు నమోదైనట్లు తెలిపింది. వేడి గాలుల ప్రభావాన్ని తగ్గించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వేసవి కాలం ప్రారంభానికి ముందుగానే జాతీయ, రాష్ట్ర స్థాయి హీట్ వేవ్ సంసిద్ధత సమావేశాలను నిర్వహిస్తుందని పేర్కొంది.
ఎండాకాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్‌వేవ్‌గా పేర్కొంటారు. కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే దానిని తీవ్రమైన హీట్‌వేవ్ అంటారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వడగాడ్పుల రోజుకు ఐఎండీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం.. ఒక రాష్ట్రంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటిన రోజును ‘ఒక వడగాడ్పు రోజు’గా పరిగణిస్తున్నారు. ఒకే తేదీలో 10 రాష్ట్రాల్లో వడగాడ్పులు ఉంటే ‘10 వడగాడ్పు రోజులు’గా పరిగణిస్తారు.