సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment