heat temperatures
-
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఆ వార్తలుపై తాజాగా ఐఎండీ స్పందించింది. బుధవారం మధ్యాహ్నం 2.30 సమయంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. కేవలం సెన్సార్ తప్పదం వల్లనే అత్యధికంగా ఉష్ణోగత్ర నమోదైట్లు ఐఎండీ తెలిపింది. డేటా తప్పుగా చూపించిన సెన్సార్ లోపాలపైన పరిశీలన చేస్తున్నామని ఐఎండీ తెలిపింది.Record 52.9 degrees Celsius in Delhi's Mungeshpur was "error in sensor": IMDRead @ANI Story | https://t.co/jd07Ywo0dT#IMD #Mungeshpur pic.twitter.com/WsKBmDF9OP— ANI Digital (@ani_digital) May 29, 2024 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజజు నిన్న స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు అని అన్నారు. ఇక.. ముంగేశ్‌పూర్ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్గఢ్లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఈ వేడి ఏమార్చేస్తోంది..!
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా? సాక్షి సెంట్రల్ డెస్క్ జంతుజాలం ‘వలస మారె!’ మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు. ♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం. ♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్టూచేమ.. వరుస మారె.. ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి. ♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. ♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్‌లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్‌లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు. అడవి రూపు మారె... వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది. ♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం. ♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది. ♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు. రోగాల తీరు మారె.. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. ♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది. ♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. కాలం అదను మారె.. ♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది. ♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది. ♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి. ♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం. -
కణకణమండే నిప్పుల కొలిమి, భగభగా మండుతున్న నగరాలు
దేశాలు కుతకుతలాడుతున్నాయి. వందల మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో ఢిల్లీ, హరియాణాతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం ‘హీట్ డోమ్’లు ఏర్పడటమే. ఉన్నట్టుండి ఈ హీట్ డోమ్‌లు ఏమిటి? ఎందుకు ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు అంచనాలేమిటన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఏమిటీ హీట్ డోమ్? ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇలా హీట్ డోమ్ ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి ఒక్కోసారి రెండు, మూడు వారాల వరకు కూడా ఇవి కొనసాగుతాయి. కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హీట్‌డోమ్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో కొద్ది కిలోమీటర్ల ఎత్తున (స్ట్రాటోస్ఫియర్ పొరలో).. భూమి చుట్టూ తిరిగే గాలి ప్రవాహాలు (పవనాలు) ఉంటాయి. భూమ్మీద ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పీడనాలను ఈ పవనాలు సమం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఈ పవనాలు ఏదైనా ఓ ప్రాంతంలో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన చోట.. భూఉపరితలానికి ఎగువన వాతావరణ పీడనం పెరిగిపోతుంది. కింద ఉన్న గాలిపై ఒత్తిడి పెరిగి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడవు. ఫలితంగా సూర్యరశ్మి నేరుగా పడి.. హీట్‌డోమ్ ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. 1. వేడెక్కిన గాలి పైకి వెళ్తుంది 2. అధిక పీడనం ఆ గాలిని కిందికి తోస్తుంది 3. ఈ పరిస్థితి వల్ల మేఘాలు దూరంగా చెల్లాచెదురవుతాయి 4. గాలి ఒత్తిడి పెరిగి, ఎండ నేరుగా పడి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి ఉత్తర భారతం గరంగరం మన దేశంలో మార్చి నుంచి జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో జూలైలోనూ కొనసాగుతాయి. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఈసారి అలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ. ఢిల్లీ, హరియాణా, పరిసర ప్రాంతాల్లో హీట్ డోమ్ ఏర్పడటంతోనే.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇరవై ఏళ్లలో మరింతగా మంటలు! భారత దేశంలో మరో ఇరవై ఏళ్లలో ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని.. వడగాడ్పులూ దానికి తోడవుతాయని ‘ది ఎకనమిస్ట్’మేగజైన్ వెల్లడించింది. కొన్నేళ్లుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, వాతావరణ మార్పులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. 2041 నాటికి దేశంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 49.3 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో 50 డిగ్రీలకుపైగా నమోదు కావొచ్చని పేర్కొంది. చెన్నై పరిస్థితి దారుణమవుతుందని, ఎండల తీవ్రతకు వేల మంది చనిపోవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అమెరికా, కెనడా ఆగమాగం అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాలు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతం కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. కెనడా చరిత్రలోనే అత్యధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేడికి కార్చిచ్చు చెలరేగి ఇక్కడి లిట్టన్ ప్రాంతం 90 శాతం దహనమైపోయింది. మరోవైపు రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరప్ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రత్యేకంగా కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ♦ఎండల కారణంగా ఏసీలు, ఇతర ఉపకరణా లు, నీటి వినియోగం పెరిగిపోయింది. దీనితో బిల్లులు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అమెరికాలోని న్యూయార్క్ పాలకవర్గం నిర్ణయించింది. ♦గ్రీస్‌లోని ఏథెన్స్, ఇతర పట్టణాల్లో ఎండ తీవ్రత, దగ్గర్లోని కూలింగ్ సెంటర్లను సూచించేందుకు యాప్స్ వినియోగిస్తున్నారు. ♦ఇజ్రాయెల్ బహిరంగ ప్రదేశాలు, వాక్ వే లలో నీడ కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం డిజైన్లు పంపాలని పోటీలు నిర్వహిస్తోంది. అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. -
భానుడి చాటుకు బుల్లి గొడుగు
పెద్దపప్పూరు (అనంతపురం): భగభగ మండే భానుడి ధాటికి మనుషులు, మూగజీవాలే కాదు.. మొక్కలూ నేలరాలుతున్నాయి. అరటి పిలకలను కాపాడుకొనేందుకు ఓ అన్నదాత తాపత్రయాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడం రైతులకు భారమవుతోంది. అతి సున్నితంగా ఉండే అరటి మొక్కలు సూర్యప్రతాపానికి నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్కో మొక్క ఖరీదు దాదాపు రూ.10 ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు పేపర్లతో నీడ ఏర్పాటు చేస్తుండగా.. మరికొందరు వేపకొమ్మలను చిన్నగా కత్తిరించి నీడ కల్పిస్తున్నారు. జిల్లాలోని పెద్దపప్పూరు మండలం ధర్మాపురం వద్ద రైతు సూరేపల్లి నరసింహులు పొలంలో అరటి మొక్కలకు ఇలా పేపర్లతో నీడ ఏర్పాటు చేశాడు.