భానుడి చాటుకు బుల్లి గొడుగు
పెద్దపప్పూరు (అనంతపురం): భగభగ మండే భానుడి ధాటికి మనుషులు, మూగజీవాలే కాదు.. మొక్కలూ నేలరాలుతున్నాయి. అరటి పిలకలను కాపాడుకొనేందుకు ఓ అన్నదాత తాపత్రయాన్ని ఈ చిత్రం కళ్లకు కడుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడం రైతులకు భారమవుతోంది. అతి సున్నితంగా ఉండే అరటి మొక్కలు సూర్యప్రతాపానికి నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్కో మొక్క ఖరీదు దాదాపు రూ.10 ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.
కొందరు పేపర్లతో నీడ ఏర్పాటు చేస్తుండగా.. మరికొందరు వేపకొమ్మలను చిన్నగా కత్తిరించి నీడ కల్పిస్తున్నారు. జిల్లాలోని పెద్దపప్పూరు మండలం ధర్మాపురం వద్ద రైతు సూరేపల్లి నరసింహులు పొలంలో అరటి మొక్కలకు ఇలా పేపర్లతో నీడ ఏర్పాటు చేశాడు.