రోడ్డు ప్రమాదాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు (ఫైల్)
అనంతపురం టవర్‌క్లాక్: వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. గత వారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వివరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించి ఆ గణాంకాలను ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాహనాల టైర్లు పగిలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. బయలుదేరే ముందు వాహనాల చక్రాలను, ఇంజన్ కండీషన్‌లు పరిశీలించుకోవాలని సూచించారు. సుదూర ప్రయాణం చేసేవారు నిరంతరం వాహనాలు నడపకుండా అక్కడక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లాలన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రయాణంలో ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 102 నమోదుకాగా రూ.1.41లక్షలు జరిమానాలు విధించామన్నారు. ఇందులో నాలుగు కేసులలో రెండు రోజులు, మరో నాలుగు కేసులలో ఒక రోజు ప్రకారం జైలు శిక్ష విధించినట్లు వివరించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 7,746 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అలాగే ధర్మవరం సబ్‌డివిజన్ పరిధిలో 890, తాడిపత్రి 2170, పెనుకొండ 1901, కళ్యాణదుర్గం 928, పుట్టపర్తి 178, కదిరి 239, అనంతపురం ట్రాఫిక్ 663 మంది నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. వారం రోజుల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి వారిపై మొత్తం 8,030 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 4013 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన 49 మంది, వాహనం నడిపేటప్పుడు ఎల్‌ఎల్‌ఆర్ కూడా లేని 339 కేసులు, త్రిబుల్ రైడింగ్‌వెళ్లే 347 మందిపై, ఓవర్‌లోడ్‌తో వెళ్లే ఆటోలపై మోటరు వాహనాల చట్టం కింద 791 కేసులు నమోదు చేశామన్నారు. సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు, జీపులు తదితర వాహన చోదకులు 864 కేసులు, రాంగ్ రూట్‌లో వెళ్లిన వాహన చోదకులు 38 మందిపై, అతి వేగంతో వెళ్లిన 194 వాహనాలపై, ట్రాక్టర్ డ్రైవర్లు 6, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 374 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారని, 53 మంది గాయపడ్డారన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగిన రహదారులపై అడ్డంగా వాహనాలు నిలిపిన ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు, జిల్లా వాట్సాప్ నెంబర్ 9989819191కు సమాచారం చేరవేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment