పెనుకొండలో ఆర్టీసీ బస్‌టాప్‌పై ఎక్కిన విద్యార్థులు , పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న అబ్జర్వర్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల (ఏపీఆర్‌జేసీ,డీసీ) ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఉక్కపోతకు అల్లాడిపోయారు. అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామని, వసతులు ఉన్న కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. తీరా పరీక్ష రోజున చేతులెత్తేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. 12,133 మంది విద్యార్థులకు గాను 10,251 మంది హాజరయ్యారు. నగర పరిధిలో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మండుతున్న ఎండలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్లు కింద ఉంటేకూడా దుస్తులు తడిసిపోతున్నాయి. అలాంటిది అసలు ఫ్యాన్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటేనే భయమేస్తోంది. వేలాదిమంది విద్యార్థులు ఉక్కపోత మధ్య పరీక్ష రాయాల్సి వచ్చింది. ఓవైపు ఉక్కపోతను భరిస్తూ.. చమటను తుడుచుకుంటూ పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనికితోడు చాలా కేంద్రాల్లో బల్లలు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు అసౌకర్యవంతంగా నేలపైనే కూర్చొని రాయాల్సి వచ్చింది. అధికారుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇబ్బందులకు గురి చేశారంటూ వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment