APRJC exam
-
ఉక్కపోత..నేలరాత
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల (ఏపీఆర్జేసీ,డీసీ) ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు ఉక్కపోతకు అల్లాడిపోయారు. అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామని, వసతులు ఉన్న కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. తీరా పరీక్ష రోజున చేతులెత్తేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరిగింది. 12,133 మంది విద్యార్థులకు గాను 10,251 మంది హాజరయ్యారు. నగర పరిధిలో 50 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్లు కింద ఉంటేకూడా దుస్తులు తడిసిపోతున్నాయి. అలాంటిది అసలు ఫ్యాన్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలంటేనే భయమేస్తోంది. వేలాదిమంది విద్యార్థులు ఉక్కపోత మధ్య పరీక్ష రాయాల్సి వచ్చింది. ఓవైపు ఉక్కపోతను భరిస్తూ.. చమటను తుడుచుకుంటూ పరీక్ష రాయాల్సి వచ్చింది. దీనికితోడు చాలా కేంద్రాల్లో బల్లలు ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు అసౌకర్యవంతంగా నేలపైనే కూర్చొని రాయాల్సి వచ్చింది. అధికారుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇబ్బందులకు గురి చేశారంటూ వాపోయారు. -
ఏపీఆర్జేసీలో సంబంధం లేని ప్రశ్నలు!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో సంబంధం లేని ప్రశ్నలు రావడంతో విద్యార్థులు తలలు పట్టుకున్నారు. ఎంతో ఆశతో ప్రశ్నపత్రం తెరిచిన విద్యార్థులకు, సిలబస్‌కు సంబంధం లేని ప్రశ్నలు రావడంతో లబోదిబోమన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లో ప్రశ్నావళి అంతా కొత్త సిలబస్‌లోనే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో కొత్త సిలబస్‌పై శిక్షణ తీసుకున్న విద్యార్థులకు నిరాశే ఎదురైంది. జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షకు సంబంధించి బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులకు పాత సిలబస్‌లో ప్రశ్నలు వచ్చాయి. ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి ‘బీ’కోడ్ ప్రశ్నపత్రంలో 86, 87, 88, 99 ప్రశ్నలు పాత సిలబస్లోవి ఇచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. పాత సిలబస్‌లో మొదటి చాప్టర్ స్టేట్మెంట్లోని ప్రశ్నలను ఈ ప్రశ్నపత్రంలో 86,87, 88 ప్రశ్నలు అడిగారు. అలాగే పాత సిలబస్‌లో నాల్గో చాప్టర్ లీనర్ ప్రోగ్రామింగ్‌లోని ప్రశ్నను 99వ ప్రశ్నగా అడిగారు. ఇక సోషియల్ విద్యార్థులకు సంబంధించి ఏకంగా 50 బిట్లు ఉంటే వీటిలో 43 బిట్లు పాత సిలబస్లోవే అడిగారని వాపోతున్నారు. తక్కిన 7 బిట్లు కూడా జనరల్‌గా అడిగారని పులువురు విద్యార్థులు తెలిపారు.