Vehicle drivers
-
రక్షణ చత్రమంటున్నా.. రెక్లెస్!
2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్ అర్షద్ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్ నాలా నుంచి సెవెన్ టూంబ్స్ మెయిన్ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్ అలీ (45) ప్రైవేట్ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్ వాహనాన్ని డ్రైవ్ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్ బ్రేక్ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్ పెట్టుకోవడం లేదు.కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్ రైడర్ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.అడపాదడపా పోలీసుల స్పెషల్ డ్రైవ్లుహెల్మెట్ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు పట్టించుకోలేదు.తేజ్ దీప్ కౌర్ మీనన్ హైదరాబాద్ ట్రాఫిక్ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్ ఖయ్యూం ఖాన్ (ఏకే ఖాన్) సైతం హెల్మెట్ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. వాహనచోదకుల్లో నిర్లక్ష్యంనగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్ పెట్టించాలని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్ హెల్మెట్లు, హెల్మెట్ ధరించినా స్ట్రాప్ బిగించుకోకపోవడం, హెల్మెట్ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్ ధారణ సాకారం కావట్లేదు. నగరంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టిహైదరాబాద్లో వాహనచోదకులకు హెల్మెట్ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది.ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ అండ్ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓలోని రోడ్ సేఫ్టీ అండ్ ఇన్జ్యూరీ ప్రివెన్షన్ విభాగం టెక్నికల్ ఆఫీసర్ స్వేర్కర్ అల్మ్క్విస్ట్.. హైదరాబాద్‌లో హెల్మెట్ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.హెల్మెట్ వల్ల ఎన్నో ప్రయోజనాలుతలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.మెదడు రక్షణ: హెల్మెట్ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్ బ్రెయిన్ ఇన్జ్యూరీస్) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.ఫేస్ ప్రొటెక్షన్: చాలా హెల్మెట్లు ఫేస్‌షీల్డ్ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.కంటి రక్షణ: విజర్ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్లు గాలి, దుమ్ము, సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగాఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.మార్పు కోసం కృషి చేస్తున్నాంగతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి. జంక్షన్లలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్ పెట్టడం, హెల్మెట్ పెట్టుకున్నా దాని స్ట్రాప్ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం. - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
నలుగురు ధనికుల కోసం దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదు: సీఎం జగన్
-
నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కరోనా సమయంలోనూ వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అందించామని గుర్తు చేశారు. చదవండి: గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’ ‘‘పాదయాత్ర సమయంలో డ్రైవర్ సోదరులు 2018 మే 14న ఏలూరులో నన్ను కలిసి వారి కష్టాలను చెప్పారు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించాం‘’ అని సీఎం జగన్ చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని శుక్రవారం ఉదయం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రారంభించి మాట్లాడారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేల చొప్పున 2,61,516 మంది ఖాతాల్లో రూ.261.51 కోట్లను బటన్‌న్‌నొక్కి జమ చేశారు. దేశంలో ఎక్కడా లేదు... వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్ చెప్పారు. ‘‘సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. డ్రైవర్ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు ఖాతాల్లో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఈ ఏడాదితో కలిపి మొత్తం రూ.1,026 కోట్లు వారికి అందచేశాం. వారంతా స్వయం ఉపాధి కల్పించుకుంటూ రోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న వాహనదారులకు అండగా నిలిచేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం. నాడు.. రూ.40 కోట్లకుపైగా ఫైన్ల బాదుడు టీడీపీ హయాంలో ఆటోడ్రైవర్లపై కాంపౌండింగ్ ఫీజు విధించి విపరీతంగా దోచుకున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ‘‘2014–2015లో రూ.6 కోట్లు, 2015–16లో రూ.7.39 కోట్లు, 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18లో రూ.10.19 కోట్లు, 2018–19లో రూ.7 కోట్లు చొప్పున ఐదేళ్లలో ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు గుంజుకున్నారు. మీ జగన్ అన్న.. తమ్ముడి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఆటో డ్రైవర్ల నుంచి అపరాధ రుసుము రూపంలో వసూలు చేసింది కేవలం రూ.68 లక్షలు. ఇక 2020–21లో విధించింది రూ.35 లక్షలు మాత్రమే’’ అని తెలిపారు. ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది.. అర్హత కలిగిన వారు ఏ కారణంతోనైనా దరఖాస్తు చేసుకోలేకపోతే తిరిగి డిసెంబర్లో మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. పేదలకు ఎంత వీలైతే అంత మేర మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు. ‘అర్హత ఉన్న వారికి ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది... అర్హులందరికీ కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించే ప్రభుత్వం మనది’ అని సీఎం జగన్ తెలిపారు. అప్పులు చేసీ ఆదుకోలేదు.. టీడీపీ హయాంలో చేసిన అప్పుల కంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. అప్పులు చేసి కూడా టీడీపీ సర్కారు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్టచతుష్టయంలా తయారై అసత్యాలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, సత్యవతి, కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనారోగ్యంతో ఉంటే ఇట్టే పట్టేస్తుంది..
సికింద్రాబాద్: వాహనాలు నడుపుతున్న సమయంలో డ్రైవర్లు ఉన్నఫలంగా అనారోగ్యం బారిన పడితే.. ఏం కాదులే అనుకుని డ్రైవర్ వాహనాన్ని నడుపుతూ వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు లేకపోలేదు. ఇటువంటి సమయాల్లో సదరు డ్రైవరుకు బీపీ పెరిగినా.. గుండె కొట్టుకునే పద్ధతుల్లో మార్పులు చోటుచేసుకున్నా సదరు ప్రమాదకర పరిస్థితులు కనిపెట్టేందుకు స్మార్ట్ గ్లౌజ్‌ను సీతాఫల్మండి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని రూపొందించింది. ఈ “స్మార్ట్ గౌజ్’ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి అవార్డును గెల్చుకుంది. అదే సమయంలో ఇదే ప్రాజెక్టు జాతీయ ఇన్స్పైర్ మేళా ప్రదర్శనకు ఎంపికైంది. గత విద్యాసంవత్సరం (2020–21)లో కరోనా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా విద్యార్థుల ఇన్స్పైర్ మేళాను కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థల అధికారులు ఆన్లైన్లో నిర్వహించారు. సీతాఫల్‌మండికి చెందిన 8వ తరగతి విద్యార్థిని సఫియాబేగం అనే బాలిక రూపొందిన స్మార్ట్గ్లజ్ ప్రదర్శనను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. గతనెలలో ఆన్లైన్ ప్రదర్శన జరిగినప్పటికీ..సదరు ప్రదర్శనలకు అవార్డులను శుక్రవారం ప్రకటించారు. సఫియాబేగం స్మార్ట్ గ్లజ్ ప్రదర్శనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి పోటీ పడిన 12 ప్రదర్శనల్లో స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనను ఉత్తమ ప్రదర్శనగా ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక చేయడంతోపాటు జాతీయ ఇన్స్పైర్ మేళాలో ప్రదర్శించేదుకు ఎంపిక చేశారు. కాగా, స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనకు అవార్డు రావడం, జాతీయ ప్రదర్శనకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తితోపాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి ప్రదర్శనకు స్మార్ట్గ్లౌజ్ ప్రదర్శనలో మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేవిధంగా రూపొందించనున్నట్టు హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. ప్రస్తుతం రూపొందించి స్మార్ట్గ్లౌజ్ అనారోగ్యకర పరిస్థితులను మాత్రమే లైట్లు వెలుగడం ద్వారా డ్రైవరుకు మాత్రమే తెలియజేస్తుందని చెప్పారు. ఇక ముందు ఇదే గ్లౌజ్ డ్రైవరు అనారోగ్యకర పరిస్థితులు వాహనం నడిపిస్తున్న డ్రైవరుకు తెలియజెప్పడంతోపాటు కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌కు మెస్సేజ్ అందించే విధంగా రూపొందిస్తున్నామని చెప్పారు. సుదూర ప్రాంతాలకు లారీలు, ట్రక్కులు ఇతర భారీ వాహనాలు రోజుల తరబడి నడిపించే డ్రైవర్లుకు స్మార్ట్గ్లౌజ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త !
అనంతపురం టవర్‌క్లాక్: వేసవిలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. గత వారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ వివరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించి ఆ గణాంకాలను ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల వాహనాల టైర్లు పగిలి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. బయలుదేరే ముందు వాహనాల చక్రాలను, ఇంజన్ కండీషన్లు పరిశీలించుకోవాలని సూచించారు. సుదూర ప్రయాణం చేసేవారు నిరంతరం వాహనాలు నడపకుండా అక్కడక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లాలన్నారు. పిల్లలు, వృద్ధులు ప్రయాణంలో ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత వారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 102 నమోదుకాగా రూ.1.41లక్షలు జరిమానాలు విధించామన్నారు. ఇందులో నాలుగు కేసులలో రెండు రోజులు, మరో నాలుగు కేసులలో ఒక రోజు ప్రకారం జైలు శిక్ష విధించినట్లు వివరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 7,746 మందికి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అలాగే ధర్మవరం సబ్‌డివిజన్ పరిధిలో 890, తాడిపత్రి 2170, పెనుకొండ 1901, కళ్యాణదుర్గం 928, పుట్టపర్తి 178, కదిరి 239, అనంతపురం ట్రాఫిక్ 663 మంది నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. వారం రోజుల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపి వారిపై మొత్తం 8,030 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఇందులో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 4013 కేసులు, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన 49 మంది, వాహనం నడిపేటప్పుడు ఎల్ఎల్ఆర్ కూడా లేని 339 కేసులు, త్రిబుల్ రైడింగ్వెళ్లే 347 మందిపై, ఓవర్‌లోడ్‌తో వెళ్లే ఆటోలపై మోటరు వాహనాల చట్టం కింద 791 కేసులు నమోదు చేశామన్నారు. సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు, జీపులు తదితర వాహన చోదకులు 864 కేసులు, రాంగ్ రూట్లో వెళ్లిన వాహన చోదకులు 38 మందిపై, అతి వేగంతో వెళ్లిన 194 వాహనాలపై, ట్రాక్టర్ డ్రైవర్లు 6, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 374 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందారని, 53 మంది గాయపడ్డారన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగిన రహదారులపై అడ్డంగా వాహనాలు నిలిపిన ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100కు, జిల్లా వాట్సాప్ నెంబర్ 9989819191కు సమాచారం చేరవేయాలన్నారు. -
ఆధార్ చూపాలని చట్టంలో ఎక్కడుంది: హైకోర్టు
హైదరాబాద్ : వాహనాల తనిఖీ సమయంలో ఆధార్ కార్డు చూపాలని జారీ చేసిన సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆధార్ కార్డు చూపాలని చట్టంలో ఎక్కడుందని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది. కాగా సైబరాబాద్ జంట కమిషనరేట్ పరిధిలో వాహనదారులకు ఆధార్‌ను లింక్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాల (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్)తో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ పెట్టుకోకుండా కేవలం వాహనంతోనే వచ్చే వాహనదారుడి మీద తప్పనిసరిగా మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
సీటు బెల్టే శ్రీరామ రక్ష
♦ కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. ♦ తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో ♦ రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. ♦ పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకుతాజా ఉదాహరణ ♦ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ ♦ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, హైదరాబాద్ ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
అన్నింటా ‘ఆమె’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సృష్టికి.. త్యాగానికి.. అనురాగానికి.. ఆత్మీయతకు.. అనుబంధానికి.. ప్రతిరూపం మహిళ. ఇంటిపని, వంటపనికే పరిమితం కాకుండా... పురుషులకు తామేమీ తీసిపోమని నిరూపించుకుంటున్నారు. ఇల్లాలిగా భర్తకు సేవచేస్తూ.. అమ్మగా పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ.. వారి భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటూనే.. ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూ.. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. జిల్లా జనాభాలోనూ పురుషులకంటే వారే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ప్రజాప్రతినిధిగా గ్రామ, మండల, నియోజకవర్గ, మున్సిపాలిటీలు, జిల్లా పాలనలోనూ మహిళ ముందుకు దూసుకెళ్తున్నారు. అన్నింటా తానై బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. అందుకు జిల్లా పరిపాలనాధికారి జానకినే నిదర్శనంగా చెప్పొచ్చు. అదేవిధంగా వైద్య ఆరోగ్య, స్త్రీశిశు సంక్షేమం, పౌరసరఫరాల శాఖ వంటి ముఖ్యమైన శాఖల్లోనూ మహిళలే అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా భద్రతాధికారులు, ప్రాణం పోసే వైద్య వృత్తిలో.. జ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయురాళ్లు.. పారిశ్రామికవేత్తలు.. రైతులు, కూలీలు, వాహన డ్రైవర్లు, వివిధ వృత్తుల్లో ముందుకెళ్తున్న మహిళలు ఎందరో ఆదర్శంగా నిలుస్తున్నారు. వికలాంగులైన మహిళలు కూడా ఉన్నత చదువులు చదివి.. లక్ష్యం చేరుకున్న వారెందరో ఉన్నారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు
సంగారెడ్డి క్రైం : మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, అజాగ్రత్తతోపాటు పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడపడమేనని కారణమని తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి మండలం కంది శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించి లారీ న డుపుతూ ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ఆరుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 65వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఈ రహదారి హైదరాబాద్ - ముంబయి జాతీయ రహదారి కావడం వల్ల ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రతినిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. దీంతో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు గానీ, చిన్న వాహనాలు గానీ వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఈ రహదారిపై ప్రతినిత్యం వందలాది సంఖ్యలో భారీ వాహనాలు, టూరిస్టు బస్సులు, లారీలు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. పోతిరెడ్డిపల్లి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి పూట అత్యవసర సమయాల్లో రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో పాటు ఈ రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై ఉన్న పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, పెద్దాపూర్, బుదేర, కంకోల్, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తుంటారు. ప్రమాదాల నివారణ కోసం అధికారులు రోడ్లపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ సింగిల్ రోడ్డుపై మూల మలుపులు ఎక్కువగా ఉండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మద్యం మత్తు.. ప్రాణాలు హరీ... పీకల దాకా మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై అంటే సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు ఎక్కువగా దాబాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్‌లు జోరుగా సాగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో వాహన డ్రైవర్లు దాబాల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోడ్డుపై ప్రమాదాలకు నిలయంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. -
వాహన చోదకుల్లో మార్పు రావాలి
సాక్షి, ముంబై: వాహన చోదకుల్లో మార్పు వచ్చినప్పుడే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయంటున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు. అందరూ ట్రాఫిక్ నియమాల ను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటికేడు పెరుగుతున్న వాహనాలతో పాటు నగర రోడ్లను మరింత విస్తరించాల్సిన అవసరముందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీస్ చీఫ్ డాక్టర్ బి.కె.ఉపాధ్యాయ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిం చడం ద్వారా జరిమానా చెల్లించాల్సి వస్తుందన్న అవగాహన వాహన చోదకుల్లో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే జరిమానాను భారీగా పెంచితే అప్పుడైనా ట్రాఫిక్ నియమాలను పాటిస్తారో చూడాలని తెలిపారు. ఇంటికి వెళ్లాలనే తొందరలో చాలా మంది ట్రాఫిక్ నియమాలను తుంగలో తొక్కుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. కొన్ని నిబంధనలు అసౌకర్యంగా భావిం చి పాటించడం లేదని తెలిపారు. ‘లేన్ డిసిప్లేన్ లేకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందు వేగంగా వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అనేక మంది మృతి చెందుతున్నార’ని చెప్పారు. చాలా సందర్భాలలో వాహన చోదకులు సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసు ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు. లేదంటే వారు నియమాలను గాలికి వదిలేస్తున్నారన్నారు. ట్రాఫిక్ నియమాలు వాహన చోదకుల జాగ్రత్త కోసం రూపొందిం చినవని, వారికి అసౌకర్యం కలిగించేందుకు కాదని తెలిపారు. దీనిని నగరవాసులు అర్థం చేసుకొని నియమాలను పాటించాలని కోరారు. ‘ట్రాఫిక్ శాఖలో సిబ్బంది కొరత వల్ల ప్రతి జంక్షన్, సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసును అందుబాటులో ఉంచడం సాధ్యం కావడం లేదు. దీనిని చాలామంది వాహన చోదకులు ఆసరాగా తీసుకొని నిబంధనలు ఉల్లంఘిస్తున్నార’ని మండిపడ్డారు. నగరవాసుల్లో ట్రాఫిక్ నియమాలు తమ కోసం రూపొందించారనే అవగాహన వచ్చినప్పడే ట్రాఫిక్ జామ్‌తో పాటు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఇదిలావుండగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ట్రాఫిక్ పోలీసులు భారీగానే జరిమానా వసూలు చేశారు. 5,34,783వారి నుంచి రూ.6,01,43,500 వసూళ్లు చేశారు. 2013లో నియమాలు ఉల్లఘించిన 20,48, 604 వాహన చోదకుల నుంచి రూ.23,09,82,860 వసూలు చేశారు. 2012లో 15,17,783 మంది నుంచి రూ.23,09,82,860 వసూలు చేశారు.