నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్‌ | CM YS Jagan Speech On YSR Vahana Mitra Programme Vizag | Sakshi
Sakshi News home page

నలుగురు ధనికులు, దత్తపుత్రుడి కోసం నడిచే సర్కారు కాదిది: సీఎం జగన్‌

Published Fri, Jul 15 2022 12:36 PM | Last Updated on Sat, Jul 16 2022 6:49 AM

CM YS Jagan Speech On YSR Vahana Mitra Programme Vizag - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచి చేస్తూ కులమతాలు, లంచాలు, వివక్షకు తావు లేకుండా మూడేళ్లలో రూ.1.65 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలోనూ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని అందించామని గుర్తు చేశారు.
చదవండి: గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’

‘‘పాదయాత్ర సమయంలో డ్రైవర్‌ సోదరులు 2018 మే 14న ఏలూరులో నన్ను కలిసి వారి కష్టాలను చెప్పారు. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం ప్రారంభించాం‘’ అని సీఎం జగన్‌ చెప్పారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని శుక్రవారం ఉదయం విశాఖ ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో సీఎం జగన్‌ ప్రారంభించి మాట్లాడారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 వేల చొప్పున 2,61,516 మంది ఖాతాల్లో రూ.261.51 కోట్లను బటన్‌న్‌నొక్కి జమ చేశారు.

దేశంలో ఎక్కడా లేదు...
వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని సీఎం జగన్‌ చెప్పారు. ‘‘సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నాం. డ్రైవర్‌ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి రూ.40 వేలు ఖాతాల్లో జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇదే. ఈ ఏడాదితో కలిపి మొత్తం రూ.1,026 కోట్లు వారికి అందచేశాం. వారంతా స్వయం ఉపాధి కల్పించుకుంటూ రోజూ లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న వాహనదారులకు అండగా నిలిచేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చాం.

నాడు.. రూ.40 కోట్లకుపైగా ఫైన్ల బాదుడు
టీడీపీ హయాంలో ఆటోడ్రైవర్లపై కాంపౌండింగ్‌ ఫీజు విధించి విపరీతంగా దోచుకున్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. ‘‘2014–2015లో రూ.6 కోట్లు, 2015–16లో రూ.7.39 కోట్లు, 2016–17లో రూ.9.68 కోట్లు, 2017–18లో రూ.10.19 కోట్లు, 2018–19లో రూ.7 కోట్లు చొప్పున ఐదేళ్లలో ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి దాదాపు రూ.40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు గుంజుకున్నారు. మీ జగన్‌ అన్న.. తమ్ముడి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఆటో డ్రైవర్ల నుంచి అపరాధ రుసుము రూపంలో వసూలు చేసింది కేవలం రూ.68 లక్షలు. ఇక  2020–21లో విధించింది రూ.35 లక్షలు మాత్రమే’’ అని తెలిపారు.

ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది..
అర్హత కలిగిన వారు ఏ కారణంతోనైనా దరఖాస్తు చేసుకోలేకపోతే తిరిగి డిసెంబర్‌లో మరోసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం జగన్‌ ప్రకటించారు. పేదలకు ఎంత వీలైతే అంత మేర మేలు చేసే ప్రభుత్వం తమదన్నారు. ‘అర్హత ఉన్న వారికి ఏ విధంగా ఎగ్గొట్టాలని చూసే ప్రభుత్వం కాదిది... అర్హులందరికీ కులం, మతం, ప్రాంతం, పార్టీ అనే తేడా చూడకుండా సంతృప్త స్థాయిలో పథకాలు అందించే ప్రభుత్వం మనది’ అని సీఎం జగన్‌ తెలిపారు.

అప్పులు చేసీ ఆదుకోలేదు..
టీడీపీ హయాంలో చేసిన అప్పుల కంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అప్పులు చేసి కూడా టీడీపీ సర్కారు ప్రజలకు మంచి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 దుష్టచతుష్టయంలా తయారై అసత్యాలతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, సత్యవతి, కలెక్టర్‌ మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement