సీటు బెల్టే శ్రీరామ రక్ష
♦ కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే..
♦ తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో
♦ రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే..
♦ పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకుతాజా ఉదాహరణ
♦ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ
♦ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం
సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు.
- సాక్షి, హైదరాబాద్
ఆ రెండు ఘటనల్లోనూ..
టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్‌సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఆరవ్‌రెడ్డిని కాపాడింది సీటు బెల్టే.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్‌రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు.
సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.?
కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు.
సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు..
కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్