ఎయిర్‌బ్యాగ్ పనిచేసేదిలా...
హౌ ఇట్ వర్క్స్
వాహన ప్రమాదాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాల్లో సీటు బెల్టులు పెట్టుకోవడం ఒకటైతే.... వాహనంలో ఎయిర్‌బ్యాగులు ఉండేలా చూసుకోవడం రెండోది. సీట్‌బెల్టుల మాటెలా ఉన్నా... ఎయిర్‌బ్యాగ్‌ల వెనుక ఉన్న టెక్నాలజీ ఆసక్తికరమైంది. ఈ వ్యవస్థలో బ్యాగుతోపాటు ఓ యాక్సెలరోమీటర్, ఓ సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్, సూక్ష్మస్థాయి తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటాయి. మీ వాహనం వేగం ఎంత త్వరగా మారుతోందో యాక్సెలరోమీటర్ గమనిస్తూంటుంది. నిర్దిష్ట వేగాన్ని దాటినప్పుడు... లేదా ఇంకో వాహనాన్ని లేదా మరే ఇతర వస్తువును ఢీకొన్నా ఈ పరికరం సర్క్యూట్‌ను ఆన్ చేస్తుంది.
ఆ వెంటనే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకునేందుకు వాడే హీటర్ తెలుసుగా... హీటింగ్ ఎలిమెంట్ దాదాపు ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం (సోడియం అజైడ్) పేలిపోయి ఉత్పత్తి చేసే నైట్రోజన్ గ్యాస్‌తో బ్యాగ్ నిండిపోతుంది. ఇంకో విషయం... నైట్రోజన్ గ్యాస్‌తో నిండిన ఈ బ్యాగ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా విచ్చుకున్న తరువాత నెమ్మదిగా దాంట్లోని గాలిని విడుదల చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఈ రెండు చర్యల ఫలితంగా వాహనం ఢీ కొనడంతో మన శరీరంపై పడ్డ ఒత్తిడి తోపాటు గాయాల తీవ్రత కూడా తగ్గిపోతుందన్నమాట! ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? సెకనులో నాలుగో వంతు మాత్రమే!