Vehicle accidents
-
వాహనదారులపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి,గుంటూరు:కేంద్ర మోటార్ వాహనాల సవరణ చట్ట నిబంధనలను సరిగా అమలు చేయట్లేదంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై బుధవారం(డిసెంబర్ 18) విచారణ జరిగింది. చట్ట నిబంధనల ఉల్లంఘనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిబంధనలు ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎక్కడికక్కడే వాహనాలను ఆపి జరిమానా విధించండి. వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే.99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారు. జరిమానా కట్టకుంటే వాహనాన్ని ఎందుకు జప్తు చేయడం లేదు. వాహనదారుల్లో క్రమశిక్షణ లోపించింది. విపరీతమైన వేగం,హారన్లతో నరకం చూపిస్తున్నారు. హైబీమ్ తో ఎంతోమంది చనిపోతున్నారు. హైబీమ్ వాడినందుకు జరిమానా ఎందుకు కట్టరు. చట్ట నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందే.ఇందుకు ఏం చేస్తున్నారో చెప్పండి.పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయండి’ అని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పోలీసులు నిబంధనలు అమలు చేసి ఉంటే ఈ నాలుగు నెలల్లో మృతి చెందిన 677 మందిలో కొందరైనా బతికి ఉండే వాళ్లని హైకోర్టు వ్యాఖ్యానించింది.తదుపరి విచారణ జనవరి 8వ తేదీకి వాయిదా వేసింది. -
Motor Accident Claims: ఆ కేసులను వేగంగా పరిష్కరించండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: మోటార్ వాహనాల ప్రమాదాల క్లెయిమ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకోసం మూడు నెలల్లోగా పోలీసు స్టేషన్లలో ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాద క్లెయిముకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ నజీర్, జేకే మహేశ్వరితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ‘‘రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తు అధికారి మోటారు వాహనాలు(సవరణ) నిబంధనలు–2022 ప్రకారం నడుచుకోవాలి. ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టును 48 గంటల్లోగా క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించాలి’’ అని పేర్కొంది. -
ఎయిర్‌బ్యాగ్ పనిచేసేదిలా...
హౌ ఇట్ వర్క్స్ వాహన ప్రమాదాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాల్లో సీటు బెల్టులు పెట్టుకోవడం ఒకటైతే.... వాహనంలో ఎయిర్‌బ్యాగులు ఉండేలా చూసుకోవడం రెండోది. సీట్బెల్టుల మాటెలా ఉన్నా... ఎయిర్‌బ్యాగ్‌ల వెనుక ఉన్న టెక్నాలజీ ఆసక్తికరమైంది. ఈ వ్యవస్థలో బ్యాగుతోపాటు ఓ యాక్సెలరోమీటర్, ఓ సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్, సూక్ష్మస్థాయి తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటాయి. మీ వాహనం వేగం ఎంత త్వరగా మారుతోందో యాక్సెలరోమీటర్ గమనిస్తూంటుంది. నిర్దిష్ట వేగాన్ని దాటినప్పుడు... లేదా ఇంకో వాహనాన్ని లేదా మరే ఇతర వస్తువును ఢీకొన్నా ఈ పరికరం సర్క్యూట్‌ను ఆన్ చేస్తుంది. ఆ వెంటనే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకునేందుకు వాడే హీటర్ తెలుసుగా... హీటింగ్ ఎలిమెంట్ దాదాపు ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం (సోడియం అజైడ్) పేలిపోయి ఉత్పత్తి చేసే నైట్రోజన్ గ్యాస్‌తో బ్యాగ్ నిండిపోతుంది. ఇంకో విషయం... నైట్రోజన్ గ్యాస్‌తో నిండిన ఈ బ్యాగ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా విచ్చుకున్న తరువాత నెమ్మదిగా దాంట్లోని గాలిని విడుదల చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఈ రెండు చర్యల ఫలితంగా వాహనం ఢీ కొనడంతో మన శరీరంపై పడ్డ ఒత్తిడి తోపాటు గాయాల తీవ్రత కూడా తగ్గిపోతుందన్నమాట! ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? సెకనులో నాలుగో వంతు మాత్రమే!