How It Works
-
చూపు ఎలా కలుస్తుంది?
హౌ ఇట్ వర్క్స్ / ఐరిస్ స్కానర్ మీకు ఆధార్ కార్డు ఉందా? గ్యాస్ సబ్సిడీ మొదలుకొని అనేకానేక కార్యక్రమాలకు గుర్తింపు కోసం ఇది తప్పనిసరి. మీ వేలి ముద్రలతోపాటు కంటిలోని ప్రత్యేక భాగం ఐరిస్‌ను స్కాన్ చేసి ఆ వివరాలను కార్డులో భద్రపరచడం మీకు తెలిసిందే. మరి... ఐరిస్‌ను గుర్తించేందుకు వాడే స్కానర్ ఎలా పనిచేస్తుందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? వచ్చే ఉంటుంది లెండి. సమాధానం ఇదిగో. మన కంట్లో గుండ్రటి ఆకారంలో ఉండే కండరాన్ని ఐరిస్ అంటారు. దాని మధ్యలోని గుండ్రటి భాగం ప్యూపిల్. కెమెరా షట్టర్ మాదిరిగా కంట్లోని ప్యూపిల్ తెరవడానికి, మూసేందుకూ పనికొచ్చేది ఐరిసే. ఈ ఐరిస్‌లో ఎలాంటి రంగులు ఉండాలి? ఏ రకమైన కూర్పు ఉండాలన్నది మనం గర్భంలో ఉండగానే నిర్ధారణైపోతుంది. మెలనిన్ అనే రసాయనం మోతాదు ఆధారంగా రంగు ఏమిటన్నది తెలుస్తుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే గోధుమవర్ణం... తక్కువుంటే నీలివర్ణమన్నమాట. ఐరిస్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఇది ఏ ఒక్కరిలోనూ ఒకేమాదిరిగా ఉండదు. కవలల కళ్లను పోల్చి చూసినా ఐరిస్లోని రంగులు, కూర్పులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే దీన్ని వ్యక్తుల నిర్ధారణకు విరివిగా వాడుతున్నారు. కెమెరాలాంటి పరికరంతో కంటిని స్కాన్ చేసినప్పుడు ఐరిస్‌ను మామూలు కాంతిలోనూ, అతినీలలోహిత కిరణాల కాంతిలోనూ ఫొటోలు తీస్తారు. ఈ రెండు ఫొటోలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి అనవసరమైన వివరాలను (కనురెప్పలపై వెంట్రుకలు తదితరాలు) తొలగిస్తారు. స్కానర్.. ఐరిస్ కండరాలు మొదలైన చోటు, లోపలిభాగాలను వృత్తాల ద్వారా గుర్తించి... వాటిని వేర్వేరు ప్రాంతాలుగా విభజించి తేడాలను గుర్తిస్తుంది. ఆ తరువాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఐరిస్‌లో ఉండే దాదాపు 240 ప్రత్యేక ఫీచర్లను గుర్తిస్తుంది. ఆ వివరాలను 512 అంకెలున్న పొడవాటి సంఖ్య ద్వారా గుర్తిస్తారు. దీన్నే ఐరిస్ కోడ్ అని పిలుస్తారు. దీంతో మీ ఐరిస్ వివరాలు కంప్యూటర్ డేటాబేస్‌లో నిక్షిప్తమైనట్లే. ఆ తరువాత ఎప్పుడు అవసరమైనా మీ ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉండే సమాచారంలోని 512 అంకెల సంఖ్యను మీ కంటి స్కాన్ ద్వారా వచ్చే వివరాలను సరిపోల్చడం ద్వారా మీరు ఫలానా అని తెలిసిపోతుందన్నమాట. -
ఎయిర్‌బ్యాగ్ పనిచేసేదిలా...
హౌ ఇట్ వర్క్స్ వాహన ప్రమాదాల్లో మనల్ని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు ఉన్న మార్గాల్లో సీటు బెల్టులు పెట్టుకోవడం ఒకటైతే.... వాహనంలో ఎయిర్‌బ్యాగులు ఉండేలా చూసుకోవడం రెండోది. సీట్బెల్టుల మాటెలా ఉన్నా... ఎయిర్‌బ్యాగ్‌ల వెనుక ఉన్న టెక్నాలజీ ఆసక్తికరమైంది. ఈ వ్యవస్థలో బ్యాగుతోపాటు ఓ యాక్సెలరోమీటర్, ఓ సర్క్యూట్, హీటింగ్ ఎలిమెంట్, సూక్ష్మస్థాయి తక్కువ మోతాదులో పేలుడు పదార్థం ఉంటాయి. మీ వాహనం వేగం ఎంత త్వరగా మారుతోందో యాక్సెలరోమీటర్ గమనిస్తూంటుంది. నిర్దిష్ట వేగాన్ని దాటినప్పుడు... లేదా ఇంకో వాహనాన్ని లేదా మరే ఇతర వస్తువును ఢీకొన్నా ఈ పరికరం సర్క్యూట్‌ను ఆన్ చేస్తుంది. ఆ వెంటనే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంట్ ప్రసారమవుతుంది. ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకునేందుకు వాడే హీటర్ తెలుసుగా... హీటింగ్ ఎలిమెంట్ దాదాపు ఇలాంటిదే. కాకపోతే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది. ఆ వేడికి పేలుడు పదార్థం (సోడియం అజైడ్) పేలిపోయి ఉత్పత్తి చేసే నైట్రోజన్ గ్యాస్‌తో బ్యాగ్ నిండిపోతుంది. ఇంకో విషయం... నైట్రోజన్ గ్యాస్‌తో నిండిన ఈ బ్యాగ్‌లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఒకసారి పూర్తిగా విచ్చుకున్న తరువాత నెమ్మదిగా దాంట్లోని గాలిని విడుదల చేసేందుకు ఇవి పనికొస్తాయి. ఈ రెండు చర్యల ఫలితంగా వాహనం ఢీ కొనడంతో మన శరీరంపై పడ్డ ఒత్తిడి తోపాటు గాయాల తీవ్రత కూడా తగ్గిపోతుందన్నమాట! ఈ మొత్తం వ్యవహారం పూర్తయ్యేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? సెకనులో నాలుగో వంతు మాత్రమే! -
బార్కోడ్ ఎలా పని చేస్తుంది?
హౌ ఇట్ వర్క్స్ దుకాణానికి వెళ్లి మీరు కొనే ప్రతి ప్యాకేజీ వెనుక వైపు నిలువు గీతలు ఉండటం మీరు గమనించే ఉంటారు. సూపర్ మార్కెట్లలో ఈ గీతలున్న ప్రాంతాన్ని ఓ పరికరం ముందు ఉంచితే దాని ధర వివరాలన్నీ కంప్యూటర్‌పై కనిపిస్తాయి. బిల్లింగ్ సులువు చేసే ఈ గీతల పట్టీలో ధర వివరాలు ఎలా నిక్షిప్తమవుతాయో మీకు తెలుసా? దానికన్నా ముందు ఓ విషయం. బార్కోడ్లకు సంబంధించిన పేటెంట్ 1951లోనే బెర్నార్డ్ సిల్వర్, జోసెఫ్ వుడ్‌ల్యాండ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించినా... 1970లో ఐబీఎం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన యూనివర్సల్ ప్రాడక్ట్ కోడ్ ప్రస్తుతం విసృ్తత వినియోగంలో ఉంది. ఈ కోడ్ ఎలా పనిచేస్తుందంటే... బార్కోడ్లో నలుపు రంగు పట్టీలు వేర్వేరు వెడల్పుల్లో ఉండటం మీరు గమనించే ఉంటారు. కొన్ని గీతలు దగ్గరగా ఉంటే మరికొన్ని కొంచెం ఎడంగా ఉంటాయి. ఈ పట్టీల దిగువనే కొన్ని అంకెలు కూడా ఉంటాయి. ఒక్కో అంకెకు ప్రత్యేకమైన గీతల అమరిక ఉంటుంది. (ఫొటో చూడండి) అన్ని రకాల వస్తువులకు ప్రత్యేకమైన నెంబరు ఇస్తారు. ఉదాహరణకు ఉప్పు... 389120, కందిపప్పు... 546988 ఇలా అన్న మాట. ఆయా అంకెల గీతల అమరికను వరుసగా ప్రింట్ చేస్తే బార్కోడ్ సిద్ధమవుతుంది. స్కానర్ ముందు ఉంచినప్పుడు లేజర్, లేదా ఎల్ఈడీ కాంతి బార్‌కోడ్‌పై పడుతుంది.ఈ కాంతి తిరిగి స్కానర్లోని ఫొటో ఎలక్ట్రిక్ సెల్పైకి ప్రతిఫలిస్తుంది. తెలుపు రంగు ఉన్న ప్రాంతం నుంచి ఎక్కువ కాంతి, మిగిలిన నలుపు పట్టీల నుంచి తక్కువ కాంతి పడుతుందన్నమాట ఈ తేడాను బట్టి దాంట్లోని అంకెలను గుర్తిస్తారు. (అధిక వెలుతురును ఆన్‌గా, తక్కువ వెలుతురును ఆఫ్‌గా గుర్తిస్తుందన్నమాట) అంకెల రీడింగ్ పూర్తి కాగానే.... స్కానర్లోని సర్క్యూట్ బోర్డులో ఆ అంకెలకు అనుసంధానమై ఉన్న వివరాలు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతాయి.