చూపు ఎలా కలుస్తుంది?
హౌ ఇట్ వర్క్స్ / ఐరిస్ స్కానర్
మీకు ఆధార్ కార్డు ఉందా? గ్యాస్ సబ్సిడీ మొదలుకొని అనేకానేక కార్యక్రమాలకు గుర్తింపు కోసం ఇది తప్పనిసరి. మీ వేలి ముద్రలతోపాటు కంటిలోని ప్రత్యేక భాగం ఐరిస్‌ను స్కాన్ చేసి ఆ వివరాలను కార్డులో భద్రపరచడం మీకు తెలిసిందే. మరి... ఐరిస్‌ను గుర్తించేందుకు వాడే స్కానర్ ఎలా పనిచేస్తుందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? వచ్చే ఉంటుంది లెండి. సమాధానం ఇదిగో.
మన కంట్లో గుండ్రటి ఆకారంలో ఉండే కండరాన్ని ఐరిస్ అంటారు. దాని మధ్యలోని గుండ్రటి భాగం ప్యూపిల్. కెమెరా షట్టర్ మాదిరిగా కంట్లోని ప్యూపిల్ తెరవడానికి, మూసేందుకూ పనికొచ్చేది ఐరిసే. ఈ ఐరిస్‌లో ఎలాంటి రంగులు ఉండాలి? ఏ రకమైన కూర్పు ఉండాలన్నది మనం గర్భంలో ఉండగానే నిర్ధారణైపోతుంది. మెలనిన్ అనే రసాయనం మోతాదు ఆధారంగా రంగు ఏమిటన్నది తెలుస్తుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే గోధుమవర్ణం... తక్కువుంటే నీలివర్ణమన్నమాట. ఐరిస్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఇది ఏ ఒక్కరిలోనూ ఒకేమాదిరిగా ఉండదు. కవలల కళ్లను పోల్చి చూసినా ఐరిస్‌లోని రంగులు, కూర్పులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే దీన్ని వ్యక్తుల నిర్ధారణకు విరివిగా వాడుతున్నారు.
కెమెరాలాంటి పరికరంతో కంటిని స్కాన్ చేసినప్పుడు ఐరిస్‌ను మామూలు కాంతిలోనూ, అతినీలలోహిత కిరణాల కాంతిలోనూ ఫొటోలు తీస్తారు. ఈ రెండు ఫొటోలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి అనవసరమైన వివరాలను (కనురెప్పలపై వెంట్రుకలు తదితరాలు) తొలగిస్తారు. స్కానర్.. ఐరిస్ కండరాలు మొదలైన చోటు, లోపలిభాగాలను వృత్తాల ద్వారా గుర్తించి... వాటిని వేర్వేరు ప్రాంతాలుగా విభజించి తేడాలను గుర్తిస్తుంది. ఆ తరువాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఐరిస్‌లో ఉండే దాదాపు 240 ప్రత్యేక ఫీచర్లను గుర్తిస్తుంది. ఆ వివరాలను 512 అంకెలున్న పొడవాటి సంఖ్య ద్వారా గుర్తిస్తారు. దీన్నే ఐరిస్ కోడ్ అని పిలుస్తారు. దీంతో మీ ఐరిస్ వివరాలు కంప్యూటర్ డేటాబేస్‌లో నిక్షిప్తమైనట్లే. ఆ తరువాత ఎప్పుడు అవసరమైనా మీ ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉండే సమాచారంలోని 512 అంకెల సంఖ్యను మీ కంటి స్కాన్ ద్వారా వచ్చే వివరాలను సరిపోల్చడం ద్వారా మీరు ఫలానా అని తెలిసిపోతుందన్నమాట.