Iris scanner
-
నోకియా మరో కొత్త ఫోన్: టాప్ ఫీచర్లివేనట!
నోకియా బ్రాండులో ఇటీవలే మూడు స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. నోకియా 3, నోకియా 5, నోకియా 6 పేరుతో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో రెండు డివైజ్‌లు నోకియా 8, నోకియా 9 లను కూడా లాంచ్‌చేసేందుకు హెచ్ఎండీ గ్లోబల్ సిద్దమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే నోకియా 9 మరో రెండు నెలల్లో లాంచ్ అవుతున్నట్టు ధృవీకరణ అవగా.. తాజాగా నోకియా 8పై రూమర్లు చక్కర్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్ను చైనీస్ అవుట్లెట్ సీఎన్ఎంఓ.కామ్ రివీల్చేసింది. ఇమేజ్‌తో పాటు కొన్ని ఫీచర్లను కూడా బయటపెట్టింది. కొద్దిగా వంగిన బెజెల్-లెస్ డిస్ప్లేను నోకియా 8 కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు ఉన్నమాదిరిగా ఉండబోతుందట. అదేవిధంగా రెండు వేరియంట్లలలో ఇది లాంచ్ కాబోతుందని టాక్. ఒకటి 5.2 అంగుళాల క్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లే కాగ, మరొకటి 5.5 అంగుళాల డిస్ప్లే. అంతేకాక ఈ అవుట్లెట్ విడుదల చేసిన ఇమేజ్‌లో టైపీ-సీ యూఎస్బీ పోర్టు కూడా కిందవైపు స్టీరియో స్పీకర్ల పక్కన కనిపిస్తోంది. ఐరిష్ స్కానర్ కూడా దీనిలో ప్రధానమైన ఫీచరేనట. ఈ ఫీచర్ ఇప్పటికే శాంసంగ్ కొత్త గెలాక్సీలు ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో ఉండగా.. ఆపిల్ అప్‌కమింగ్ ఐఫోన్లో కూడా ఉండే అవకాశాలున్నాయని టెక్‌వర్గాలు చెప్పాయి. ఐపీ68 వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కూడా ఉండబోతున్నాయి. ఇమేజ్‌లను బట్టి చూస్తుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఆపిల్ అప్‌కమింగ్ యానివర్సరీ ఎడిషన్ ఐఫోన్‌కు గట్టిపోటీ ఇవ్వగలదని అర్థమవుతోంది. ఇక బ్యాటరీ విషయానికి కొస్తే నాన్ రిమూవబుల్ 4000ఎంఏహెచ్ బ్యాటరీ. మిగతా ఫీచర్లు కూడా ఈ విధంగా ఉన్నాయి.. స్నాప్‌డ్రాగన్ 821, 4జీబీ ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 835, 6జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీలలో ఇంటర్నల్‌స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఆండ్రాయిడ్ నోగట్ 7.0లు ఈ ఫోన్లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. -
చూపు ఎలా కలుస్తుంది?
హౌ ఇట్ వర్క్స్ / ఐరిస్ స్కానర్ మీకు ఆధార్ కార్డు ఉందా? గ్యాస్ సబ్సిడీ మొదలుకొని అనేకానేక కార్యక్రమాలకు గుర్తింపు కోసం ఇది తప్పనిసరి. మీ వేలి ముద్రలతోపాటు కంటిలోని ప్రత్యేక భాగం ఐరిస్‌ను స్కాన్ చేసి ఆ వివరాలను కార్డులో భద్రపరచడం మీకు తెలిసిందే. మరి... ఐరిస్‌ను గుర్తించేందుకు వాడే స్కానర్ ఎలా పనిచేస్తుందన్న సందేహం మీకెప్పుడైనా కలిగిందా? వచ్చే ఉంటుంది లెండి. సమాధానం ఇదిగో. మన కంట్లో గుండ్రటి ఆకారంలో ఉండే కండరాన్ని ఐరిస్ అంటారు. దాని మధ్యలోని గుండ్రటి భాగం ప్యూపిల్. కెమెరా షట్టర్ మాదిరిగా కంట్లోని ప్యూపిల్ తెరవడానికి, మూసేందుకూ పనికొచ్చేది ఐరిసే. ఈ ఐరిస్‌లో ఎలాంటి రంగులు ఉండాలి? ఏ రకమైన కూర్పు ఉండాలన్నది మనం గర్భంలో ఉండగానే నిర్ధారణైపోతుంది. మెలనిన్ అనే రసాయనం మోతాదు ఆధారంగా రంగు ఏమిటన్నది తెలుస్తుంది. ఎక్కువ మెలనిన్ ఉంటే గోధుమవర్ణం... తక్కువుంటే నీలివర్ణమన్నమాట. ఐరిస్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఇది ఏ ఒక్కరిలోనూ ఒకేమాదిరిగా ఉండదు. కవలల కళ్లను పోల్చి చూసినా ఐరిస్లోని రంగులు, కూర్పులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే దీన్ని వ్యక్తుల నిర్ధారణకు విరివిగా వాడుతున్నారు. కెమెరాలాంటి పరికరంతో కంటిని స్కాన్ చేసినప్పుడు ఐరిస్‌ను మామూలు కాంతిలోనూ, అతినీలలోహిత కిరణాల కాంతిలోనూ ఫొటోలు తీస్తారు. ఈ రెండు ఫొటోలను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి అనవసరమైన వివరాలను (కనురెప్పలపై వెంట్రుకలు తదితరాలు) తొలగిస్తారు. స్కానర్.. ఐరిస్ కండరాలు మొదలైన చోటు, లోపలిభాగాలను వృత్తాల ద్వారా గుర్తించి... వాటిని వేర్వేరు ప్రాంతాలుగా విభజించి తేడాలను గుర్తిస్తుంది. ఆ తరువాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఐరిస్‌లో ఉండే దాదాపు 240 ప్రత్యేక ఫీచర్లను గుర్తిస్తుంది. ఆ వివరాలను 512 అంకెలున్న పొడవాటి సంఖ్య ద్వారా గుర్తిస్తారు. దీన్నే ఐరిస్ కోడ్ అని పిలుస్తారు. దీంతో మీ ఐరిస్ వివరాలు కంప్యూటర్ డేటాబేస్‌లో నిక్షిప్తమైనట్లే. ఆ తరువాత ఎప్పుడు అవసరమైనా మీ ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉండే సమాచారంలోని 512 అంకెల సంఖ్యను మీ కంటి స్కాన్ ద్వారా వచ్చే వివరాలను సరిపోల్చడం ద్వారా మీరు ఫలానా అని తెలిసిపోతుందన్నమాట. -
‘కన్ను’ పడితేనే ప్రవేశం..
బయోమాటిక్స్ నుంచి ఐరిస్ స్కానర్ దేశీయంగా తయారైన తొలి ఉత్పాదన కంపెనీ సీఈవో తమాల్ రాయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు తీసే అవకాశం ఉంటే! మీ ఇంటి ముందు నిలుచోగానే ద్వారం తెరుచుకుంటే! అంతకంటే సౌకర్యం ఏముంటుంది. తాము అభివృద్ధి చేసిన ఇ-పరఖ్ ఐరిస్ స్కానర్‌తో మరెన్నో సౌలభ్యాలు ఉన్నాయని అంటోంది సూరత్‌కు చెందిన బయోమాటిక్స్ ఐడెంటిఫికేషన్ సొల్యూషన్స్. ‘ఏటీఎం నుంచి డబ్బులు తీయాలంటే కార్డు తప్పనిసరి. కార్డు పోయినా, పిన్ నంబరు ఎవరైనా తస్కరించినా ఖాతాలో ఉన్న డబ్బులు మర్చిపోవాల్సిందే. అదే కనుపాపను గుర్తించి పనిచేసే ఏటీఎం ఉంటే వినియోగదార్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని చెబుతున్నారు బయోమాటిక్స్ సీఈవో తమాల్ రాయ్. కనుపాపను పిన్ నంబరుగా, పాస్‌వర్డ్‌గా, తాళం చెవిగా, యాక్సెస్(ప్రవేశం) పాయింట్‌గా ఉపయోగించొచ్చని శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ పేటెంటు పెండింగులో ఉందని చెప్పారు. అయితే ఇప్పటివరకూ ఐరిస్ టెక్నాలజీని విదేశీ కంపెనీలు అందించేవి. భారత్‌లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి ఉత్పాదనను బయోమాటిక్స్ అభివృద్ధిపర్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డైటీ) నుంచి ఐరిస్ గుర్తింపు ఉత్పాదనల రంగంలో స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ పొందిన తొలి భారతీయ కంపెనీ బయోమాటిక్స్. ఆధార్‌తో ముడిపడి న సేవలకు.. ఆధార్ నమోదు సమయంలో కనుపాపతోపాటు వేలిముద్రలను సైతం సేకరించిన సంగతి తెలిసిందే. సిమ్ తీసుకునేందుకు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు గుర్తింపు కోసం ఆధార్ నకలుతోపాటు ఫొటో కూడా తీసుకెళ్లాలి. బ్యాంకులు, టెలికం స్టోర్ల వద్ద ఇ-పరఖ్ ఐరిస్ స్కానర్ ఉంటే ఇవేవీ అవసరం లేదని తమాల్ రాయ్ తెలిపారు. కస్టమర్ కనుపాప ఆధారంగా అతని పూర్తి వివరాలు కంప్యూటర్ ముందు ప్రత్యక్షమవుతాయని వివరించారు. ఈ-వీసా, ఈ-పాస్‌పోర్ట్, ప్రజాపంపిణీ వ్యవస్థ, పెన్షన్ ఇలా ఆధార్‌తో ముడిపడి ఉన్న ఎన్నో సేవలకు కాగితాలు అవసరం లేకుండానే పనులు పూర్తి అవుతాయని చెప్పారు.