రక్షణ చత్రమంటున్నా.. రెక్‌లెస్‌! | Two wheelers claimed highest number of lives in accidents | Sakshi
Sakshi News home page

రక్షణ చత్రమంటున్నా.. రెక్‌లెస్‌!

Published Wed, Jul 3 2024 12:59 AM | Last Updated on Wed, Jul 3 2024 5:37 AM

Two wheelers claimed highest number of lives in accidents

శిరస్త్రాణాన్ని శిరోభారంగా భావిస్తున్న ద్విచక్ర వాహన చోదకులు

ప్రాణాలు పోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం

పోలీసుల ఉదాసీనత

హైదరాబాద్‌లో అధిక సంఖ్యలో టూ వీలర్‌ ప్రమాదాలు

మృతుల సంఖ్యా ఎక్కువే

2012 నుంచే నగరంలో హెల్మెట్‌ తప్పనిసరి

ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాని  నిబంధన

2024 ఫిబ్రవరి 6: షేక్‌పేట గుల్షన్‌ కాలనీకి చెందిన వ్యాపారి మొహమ్మద్‌ అర్షద్‌ (22) ఈ ఏడాది ఫిబ్రవరి 6న యాక్టివా వాహనంపై ప్రయాణిస్తున్నాడు. టోలీచౌకీలోని షేక్‌పేట్‌ నాలా నుంచి సెవెన్‌ టూంబ్స్‌ మెయిన్‌ రోడ్డు వరకు ఉన్న çశ్మశానానికి సరిహద్దు గోడ ఉంది. అక్కడ అర్షద్‌ వాహనం అదుపుతప్పి ఆ గోడను బలంగా ఢీ కొంది. ఆ సమయంలో అతడి తలకు హెల్మెట్‌ లేకపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే మెహిదీపట్నంలోని ఓ ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

2024 మే 26: మాసబ్‌ట్యాంక్‌లోని ఎంజీ నగర్‌కు చెందిన మహ్మద్‌ మహబూబ్‌ అలీ (45) ప్రైవేట్‌ ఉద్యోగి. మే 26 తెల్లవారుజామున తన కుమారుడితో (15) కలిసి ద్విచక్ర వాహనంపై మెహిదీపట్నం వైపు బయలుదేరారు. మైనర్‌ వాహనాన్ని డ్రైవ్‌ చేస్తుండగా అలీ వెనుక కూర్చున్నారు. కాగా హుమయూన్‌నగర్‌ ఠాణా సమీపంలో ఆ బాలుడు వాహనాన్ని సడన్‌ బ్రేక్‌ వేసి ఆపాడు. దీంతో వెనుక కూర్చున్న అలీ కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మూడు రోజులకు కన్ను మూశారు. హెల్మెట్‌ పెట్టుకుని ఉంటే గాయాల తీవ్రత తగ్గేదని, ప్రాణం దక్కేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

హెల్మెట్‌ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్పష్టం చేస్తున్న ప్రమాదాలు, హెల్మెట్‌ ధారణ విషయంలో ఏపీ సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఇటీవల జారీ చేసిన కీలక ఉత్తర్వులు.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ ధరించడం ఎంత తప్పనిసరో తేల్చి చెబుతున్నాయి. హెల్మెట్‌ ధరించకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ప్రమాదాలు నమోదవుతున్నాయి.

2023లో మొత్తం 2,548 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఇందులో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవే దాదాపు సగం (1,263) ఉన్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 335 మంది మరణిస్తే, ఇందులో టూ వీలర్లకు సంబంధించిన మరణాలు దాదాపు 40 శాతం వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ టూ వీలర్‌ వాహనాలు నడిపేవారిలో ఇంకా అనేకమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ హెల్మెట్‌ ధరించినా ఎక్కువమంది స్ట్రాప్‌ పెట్టుకోవడం లేదు.

కొందరు అలంకారంగా బండి మీద పెట్టుకునో, తగిలించుకునో వెళ్తున్నారు. కొందరు పోలీసుల్ని చూసి హెల్మెట్‌ పెట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలూ ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి పిలియన్‌ రైడర్‌ (ద్విచక్ర వాహనం వెనుక కూర్చునేవారు) సైతం విధిగా హెల్మెట్‌ పెట్టుకోవాలని మోటారు వాహనాల చట్టం స్పష్టం చేస్తున్నా దాన్ని పట్టించుకునేవారే లేరు.

అడపాదడపా పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌లు
హెల్మెట్‌ ధారణను హైదరాబాద్‌లో 2012 లోనే తప్పనిసరి చేశారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వాహనచోదకుల అవగాహన రాహిత్యం/నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీన వైఖరితో పాటు రాజకీయ జోక్యం కూడా ఈ పరిస్థితికి కారణంగా కన్పిస్తోంది. నగర వ్యాప్తంగా దాదాపు 70 శాతం, పాతబస్తీ సహా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం మాత్రమే హెల్మెట్‌ వినియోగంలో ఉంది. వాస్తవానికి మోటారు వాహనాల చట్టం పుట్టిన నాటి నుంచే ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్‌ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ విషయాన్ని నగర పోలీసులు  పట్టించుకోలేదు.

తేజ్‌ దీప్‌ కౌర్‌ మీనన్‌ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగానికి చీఫ్‌గా వ్యవహరిస్తుండగా 2005లో తొలిసారిగా ఈ అంశం తెరపైకి వచ్చింది. అప్పట్లో పెద్ద ఎత్తున హడావుడి చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఈ నిబంధనను పక్కాగా అమలు చేయడానికి కృషి చేశారు. అయితే దీని చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టడంతో ఆశించిన స్థాయిలో ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ట్రాఫిక్‌ చీఫ్‌గా వచ్చిన అబ్దుల్‌ ఖయ్యూం ఖాన్‌ (ఏకే ఖాన్‌) సైతం హెల్మెట్‌ అంశాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. ఈ నిబంధనను అమలు చేయడానికి ముందు వాహనచోదకులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అప్పట్లో మొదటి పేజీ తరువాయి అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాల ద్వారా దాదాపు ఆరు నెలల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆపై స్పెషల్‌ డ్రైవ్స్‌కు శ్రీకారం చుట్టారు. 

వాహనచోదకుల్లో నిర్లక్ష్యం
నగరంలోని ద్విచక్ర వాహనచోదకులందరితో హెల్మెట్‌ పెట్టించాలని ట్రాఫిక్‌ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటికీ పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాలకు చెందినవారు దీనికి దూరంగానే ఉంటున్నారు. హాఫ్‌ హెల్మెట్లు, హెల్మెట్‌ ధరించినా స్ట్రాప్‌ బిగించుకోకపోవడం, హెల్మెట్‌ వెంటే ఉన్నప్పటికీ కేవలం జంక్షన్లు, పోలీసులు సమీపిస్తున్నప్పుడే తలకు పెట్టుకోవడం పరిపాటిగా మారింది.

నగరానికి చెందిన అనేకమంది వాహనచోదకులు తాము నివసిస్తున్న ప్రాంతం దాటి బయటకు వస్తేనే హెల్మెట్‌ ధరిస్తున్నారు. ఏ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకున్నా ఇబ్బందులు తప్పవనే భావన వీరికి ఉండకపోవడమే దీనికి కారణం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొన్ని రోజులు హడావుడి చేయడం, ఆపై మిన్నకుండి పోవడంతో 100 శాతం హెల్మెట్‌ ధారణ సాకారం కావట్లేదు. 

నగరంపై డబ్ల్యూహెచ్‌ఓ దృష్టి
హైదరాబాద్‌లో వాహనచోదకులకు హెల్మెట్‌ తప్పనిసరి చేయడమెట్లా అనే విషయంపై 2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దృష్టి పెట్టింది. ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహ నాలకు సంబంధించినవే ఎక్కువగా ఉండటం, వీటిలో తలకు దెబ్బతగలడం కారణంగా మరణిస్తున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ ఏడాది హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌లో రోడ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్‌ అండ్‌ స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌ఓలోని రోడ్‌ సేఫ్టీ అండ్‌ ఇన్‌జ్యూరీ ప్రివెన్షన్‌ విభాగం టెక్నికల్‌ ఆఫీసర్‌ స్వేర్కర్‌ అల్మ్‌క్విస్ట్‌.. హైదరాబాద్‌లో హెల్మెట్‌ నిబంధన అమల్లో తమ సహకారంపై నిర్ణయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో హెల్మెట్‌ వాడకం 30 శాతమే ఉందని అప్పట్లో అభిప్రాయపడ్డారు.

హెల్మెట్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు
తలకు రక్షణ: శిరస్త్రాణాలు ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురైతే దాని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. తల అంతర్గత, బహిర్గత గాయాల తీవ్రత, పుర్రె పగుళ్ల ప్రమాదం తగ్గుతుంది.
మెదడు రక్షణ: హెల్మెట్‌ అనేది ప్రమాద సమయంలో తలకు కుషన్‌లా పనిచేస్తుంది. తద్వారా మెదడుకు గాయాలు (ట్రుమాటిక్‌ బ్రెయిన్‌ ఇన్‌జ్యూరీస్‌) కాకుండా రక్షించడంలో సహాయపడుతుంది.
ఫేస్‌ ప్రొటెక్షన్‌: చాలా హెల్మెట్‌లు ఫేస్‌షీల్డ్‌ లేదా విజర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రమాదాల సమయంలో, అలాగే ప్రతికూల  వాతావరణంలో ముఖాన్ని రక్షిస్తాయి.
కంటి రక్షణ: విజర్‌ లేదా గాగుల్స్‌తో కూడిన హెల్మెట్‌లు గాలి, దుమ్ము,  సూక్ష్మస్థాయి చెత్త, క్రిమి కీటకాల నుంచి కళ్లను రక్షిస్తాయి.
ధ్వని తీవ్రత తగ్గింపు: కొన్ని హెల్మెట్‌లు చెవి రక్షణ బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. హెల్మెట్‌ పెట్టుకుంటే శబ్ద కాలుష్యం తక్కువగా
ఉంటుంది. ప్రమాద సమయంలో వినికిడి దెబ్బతినే ప్రమాదం కూడా తగ్గుతుంది.

మార్పు కోసం కృషి చేస్తున్నాం
గతంతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో పరిస్థితి బాగా మెరుగైందనే చెప్పాలి.  జంక్షన్లలోని పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్‌తో పాటు వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికీ కొందరు.. ట్రాఫిక్‌ పోలీసులు కనిపిస్తేనే హెల్మెట్‌ పెట్టడం, హెల్మెట్‌ పెట్టుకున్నా దాని స్ట్రాప్‌ బిగించుకోకపోవడం వంటివి చేస్తున్నారు. వీరి విషయంలోనూ మార్పు కోసం కృషి చేస్తున్నాం.  - పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్‌ (ట్రాఫిక్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement