ఆధార్ చూపాలని చట్టంలో ఎక్కడుంది: హైకోర్టు
హైదరాబాద్ : వాహనాల తనిఖీ సమయంలో ఆధార్ కార్డు చూపాలని జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆధార్ కార్డు చూపాలని చట్టంలో ఎక్కడుందని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను మూడువారాల పాటు వాయిదా వేసింది. కాగా సైబరాబాద్ జంట కమిషనరేట్ పరిధిలో వాహనదారులకు ఆధార్‌ను లింక్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాల (డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్)తో పాటు ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ పెట్టుకోకుండా కేవలం వాహనంతోనే వచ్చే వాహనదారుడి మీద తప్పనిసరిగా మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరికలు చేశారు. దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.