మద్యం మత్తు.. ప్రాణాలు చిత్తు
సంగారెడ్డి క్రైం : మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, అజాగ్రత్తతోపాటు పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడపడమేనని కారణమని తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి మండలం కంది శివారులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ పీకల దాకా మద్యం సేవించి లారీ న డుపుతూ ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ఆరుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
65వ నంబరు జాతీయ రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఈ రహదారి హైదరాబాద్ - ముంబయి జాతీయ రహదారి కావడం వల్ల ఈ రోడ్డుపై భారీ వాహనాలు ప్రతినిత్యం వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుంటాయి. దీంతో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు గానీ, చిన్న వాహనాలు గానీ వెళ్లాలంటే వణుకు పుడుతుంది. ఈ రహదారిపై ప్రతినిత్యం వందలాది సంఖ్యలో భారీ వాహనాలు, టూరిస్టు బస్సులు, లారీలు తిరుగుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
పోతిరెడ్డిపల్లి నుంచి జహీరాబాద్ వరకు జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల ప్రజలు రాత్రి పూట అత్యవసర సమయాల్లో రోడ్డు మీదకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో పాటు ఈ రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులైతే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సి వస్తోంది. జాతీయ రహదారిపై ఉన్న పటాన్‌చెరు, సంగారెడ్డి, సదాశివపేట, పెద్దాపూర్, బుదేర, కంకోల్, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తుంటారు. ప్రమాదాల నివారణ కోసం అధికారులు రోడ్లపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ సింగిల్ రోడ్డుపై మూల మలుపులు ఎక్కువగా ఉండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
మద్యం మత్తు.. ప్రాణాలు హరీ...
పీకల దాకా మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు సంబవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జాతీయ రహదారిపై అంటే సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు ఎక్కువగా దాబాలు ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్‌లు జోరుగా సాగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి సమయాల్లో వాహన డ్రైవర్లు దాబాల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నారు. దీంతో ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు వాహనాల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు మరింతగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ రోడ్డుపై ప్రమాదాలకు నిలయంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్ని బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.