నాగేందర్, శివాజీ, తృప్తి, వరుణ్
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి)/అబిడ్స్: డ్రైవర్ మద్యం మత్తు నలుగురి మృతికి కారణమైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట వద్ద ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు చెందిన ఇంగ్లే రామారావు అనే టీచర్ కుటుంబం, వారి బంధువులు తూఫాన్ (కేఏ39 ఏం 1863), టవేరా వాహనాల్లో మొత్తం 19 మంది కలసి గురువారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలోని రావూర్‌కు ఓ నిశ్చితార్థం వేడుకకు వెళ్లారు. శుభకార్యం ముగించుకొని తూఫాన్ వాహనంలో 12 మంది, టవేరాలో ఏడుగురు హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. శుక్రవారం వేకువజామున 2 గంటల సమయంలో తూఫాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి లారీని ఢీకొని కిందకు చొచ్చుకెళ్లింది.
ప్రమాదంలో వాహనంలోని శివాజీ (28), వరుణ్ (9), నాగేందర్ (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బంధువులు సమాచారంతో çఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను సదాశివపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన తృప్తి (16) చికిత్స పొందుతూ మృతి చెందింది. క్షతగాత్రులైన సంగీత, విజయలక్ష్మి, అనిషా, ముకుల్, వైభవ్ , రమేశ్, లక్ష్మీబాయిలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. డ్రైవర్ రవి ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పారు. తిరుగు పయనంలో దాబా వద్ద భోజనాలకు ఆగిన సమయంలో డ్రైవర్లు ఇద్దరూ మద్యం తాగారని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మహిమ అనే మహిళ ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment