Three Youth Deceased In Road Accident Over Weekend Alcohol Party- Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన ‘పార్టీ’

Dec 13 2021 7:49 AM | Updated on Dec 13 2021 10:28 AM

Three Youth Deceased In Road Accident Over Weekend Alcohol Party - Sakshi

ఉన్నత విద్యనభ్యసించిన ఈ ముగ్గురూ కొన్ని నెలల క్రితమే నగరానికి వచ్చారు. ప్రగతి నగర్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

దుండిగల్‌/కలిదిండి (కైకలూరు): మద్యం మత్తు.. అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్నాయి. నలుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు తెలంగాణలోని దుండిగల్‌ సమీపంలో బౌరంపేట వద్ద ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కలిదిండి మండలం కాళ్లపాలెం, ఆవకూరు, కోరుకొల్లు గ్రామాలకు చెందిన పుప్పాల సత్యనారాయణ కుమారుడు గణేశ్‌ (25), నరహరిశెట్టి నర్సింహారావు కుమారుడు సంజయ్‌ (25), సలాది అశోక్‌ (26) స్నేహితులు.

చదవండి: ‘గ్యారెంటీ’ కోసం డీఎస్పీని సృష్టించాడు!

ఉన్నత విద్యనభ్యసించిన ఈ ముగ్గురూ కొన్ని నెలల క్రితమే నగరానికి వచ్చారు. ప్రగతి నగర్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ప్రస్తుతం అశోక్‌ సాఫ్టువేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తుండగా మిగిలిన ఇద్దరూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. వీరి స్నేహితుడైన మియాపూర్‌కు చెందిన సాయి అప్పుడప్పుడు వీరి గదికి వస్తుండేవాడు. అతడి ద్వారా ఈ ముగ్గురికీ గాజుల వెంకటసాయి చరణ్‌తో (25) పరిచయమైంది. 

కారులో వెళ్తుండగా..
ఈ ఐదుగురూ మియాపూర్‌కు చెందిన దుర్గా, వేణుతో కలిసి శనివారం రాత్రి ప్రగతి నగర్‌లోని తమ గదిలో వీకెండ్‌ పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సాయి, దుర్గా, వేణు గదిలోనే నిద్రించారు. అశోక్‌ దగ్గరి బంధువులు షాపూర్‌ నగర్‌లోని సంజయ్‌గాంధీ నగర్‌లో ఉంటున్నారు. అశోక్‌ను వారి ఇంట్లో దింపేందుకు చరణ్, గణేశ్, సంజయ్‌ సిద్ధమయ్యారు. తెల్లవారుజామున చరణ్‌కు చెందిన కియా కారులో గండిమైసమ్మ చౌరస్తా వైపు బయలుదేరారు.

మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అక్కడ ఆగి ఉన్న ట్రాలీని వెనుక నుంచి బలంగా ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. చరణ్, సంజయ్, గణేశ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. అశోక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రతను తగ్గించే ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ.. ప్రమాద తీవ్రతకు పగిలిపోవడంతో ఫలితం దక్కలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement