ఇది ఇరాక్‌లోని ప్రఖ్యాత సావా సరస్సు.. 12.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. నిండా నీటితో చిన్నపాటి సముద్రాన్ని తలపించేది. 31 రకాలపక్షులకు, పెద్ద సంఖ్యలో జలచరాలకు ఆవాసం.. స్విమ్మింగ్ నుంచి బోటింగ్ దాకా ఆహ్లాదానికీ నిలయం.. ఇదంతా ఐదేళ్ల కిందటి సంగతి.. ఇప్పుడది ఓ చిన్న ఎడారి, దాని మధ్యలో ఓ నీటిగుంత! వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, ఇసుక తుపానుల కారణంగా మొత్తంగా ఎండిపోయింది.
కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవుతున్నాయి. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ‘వేడి’ మంటెక్కిస్తోంది. మనుషులపై మాత్రమేకాదు.. జంతువులు, చెట్లు, ఇతర జీవజాలం మొత్తంపై ప్రభావం చూపుతోంది. చల్లగా యాపిల్స్ పండేచోట మండే ఎండల్లో వచ్చే మామిడి పళ్లు కాస్తున్నాయి.. జంతువులే కాదు చెట్లూ తమ ప్రాంతాలు వదిలి ‘వలస’పోతున్నాయి.. ఇదేదో కొద్దిరోజులకో, కొన్ని ప్రాంతాలకో పరిమితమైంది కాదు.. భూమిపై జీవం మొత్తం అసాధారణ మార్పులకు లోనవుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, జీవజాలంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందామా?
సాక్షి సెంట్రల్ డెస్క్
జంతుజాలం ‘వలస మారె!’
మారుతున్న వాతావరణంలో జంతువులు ఇమడలేకపోతున్నాయి. ఆయా జంతువులకు తగిన ఆహారం దొరకడం లేదు. దీనితో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోతోంది. కొత్త కొత్త అలవాట్లు సంతరించుకుంటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తేల్చాయి.
♦అమెజాన్ అడవుల్లో పక్షులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా వాటి పరిమాణం తగ్గిపోతోందని తేల్చారు. పక్షులు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ఓ వైపు శరీర పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయని గుర్తించారు. మరోవైపు శరీరాన్ని చల్లబర్చుకోవడం, బయటి ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవడం కోసం ముక్కు, రెక్కలు, ఈకలు, తోకల పరిమాణాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించారు.
♦ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రాంతాల్లో మాంసం, పాల కోసం పెంచుతున్న పశువుల నుంచి ఉత్పత్తి తగ్గిపోతోందని ఇటీవల లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
♦మంచు ప్రాంతాల్లో బతికే ఎలుగుబంట్లు, పెంగ్విన్లు, ఇతర జీవజాతుల సంతతి తగ్గిపోతోందని అమెరికన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
♦ఏటా శీతాకాలం, ఎండాకాలంలో పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ తమకు అనువైన ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో.. ఈ వలసలు మారిపోతున్నాయి. మన దేశానికి వలస వచ్చే సైబీరియన్ కొంగల సంఖ్య కొన్నేళ్లుగా బాగా తగ్గిపోయింది. అందులోనూ కొద్దిరోజులకే అవి తిరిగి వెళ్లిపోతుండటం గమనార్హం.
♦సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో కొన్నిరకాల చేపలు, ఇతర జలచరాలు అంతరించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
చెట్టూచేమ.. వరుస మారె..
ప్రతి చెట్టు, మొక్క కూడా ఆయా ప్రాంతాల్లోని చల్లదనం, వేడి వంటి ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదిగే, మనగలిగే లక్షణాలను అలవర్చుకుంటాయి. కానీ ఉష్ణోగ్రతలు అడ్డగోలుగా పెరిగిపోవడంతో చల్లటి ప్రాంతాల్లోని పలు రకాల చెట్లు, మొక్కలు బతకలేకపోతున్నాయి. మరోవైపు అదేచోట ఉష్ణమండల చెట్లు (వేడి వాతావరణంలో మాత్రమే పెరిగే చెట్లు/ మొక్కలు) కొత్తగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
♦ఉదాహరణకు కాఫీ, తేయాకు, యాపిల్స్ వంటివి చల్లగా ఉండే హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాల్లో, పశ్చిమ కనుమలు వంటి ప్రాంతాల్లో పండుతాయి. కానీ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. అవి దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వేడిని తట్టుకునే పంటలు/ చెట్లు/మొక్కలు కొత్తగా పెరుగుతున్నాయి.
♦ఇక వేడిగా ఉండేచోట్ల మరింత వేడి పెరిగి చెట్లు, మొక్కలు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి.
♦వేడి వాతావరణంలో చెట్లు బలహీనపడుతుండటంతో.. ఫంగస్‌లు విజృంభించి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇటీవలే మన దేశంలో మూడు రకాల ఫంగస్‌లు వ్యాపించి పెద్ద సంఖ్యలో వేప చెట్లు దెబ్బతినడం దీనికి ఉదాహరణ అని నిపుణులు చెప్తున్నారు.
అడవి రూపు మారె...
వాతావరణ మార్పులతో తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, వర్షాభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అడవులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశంలోనూ భారీగా అడవులు ఎండిపోతున్నాయి. బ్రిటన్‌కు చెందిన రీడింగ్ యూనివర్సిటీ ఇటీవలే భారతదేశంలో వర్షపాతం, ఉష్ణోగ్రతల తీరు, వాటివల్ల అడవుల క్షీణతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాలు, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల క్షీణత ఎక్కువగా ఉందని పేర్కొంది. దేశంలోని వృక్షాలు, జీవజాతుల్లో పదిశాతం మేర అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపింది.
♦ 2001 – 2018 మధ్య దేశంలో 20,472 చదరపు కిలోమీటర్ల అడవులు తగ్గిపోయినట్టు పేర్కొంది. ఇది దేశంలోని మొత్తం అడవుల్లో 7.34 శాతం కావడం గమనార్హం.
♦ఇక ఒక్క 2017లోనే 2,503 చ. కిలోమీటర్ల అడవి అంతరించిపోయినట్టు పరిశోధన వెల్లడించింది.
♦‘‘ఇండియాలో కొన్నేళ్లుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అతి ఎక్కువ వేడి, వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య పెరిగింది. ఈ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఇండియాలో మరింత ఎక్కువగా అడవులకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది అటవీ సంపద, వన్యప్రాణులపైనా ప్రభావం చూపుతుంది’’అని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త అలైస్ హఫన్ పేర్కొన్నారు.
రోగాల తీరు మారె..
ఉష్ణోగ్రతలు పెరిగిపోయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ మార్పులు జరగడంతో.. కొత్త కొత్త బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు విజృంభిస్తున్నాయి. వేడి వాతావరణం కారణంగా దోమలు, ఈగలు, ఇతర కీటకాలు పెరిగి అంటు రోగాలు విజృంభిస్తున్నాయని.. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యాధులు, రోగాలు ఇతర ప్రాంతాలను కమ్ముకుంటున్నాయని గతేడాది స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
♦అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల ఊపిరితిత్తులు, గుండె నాళాల సమస్యలు, చర్మ సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయని అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇటీవలే హెచ్చరించింది.
♦వేల ఏళ్ల కిందట మంచు అడుగున కూరుకుపోయిన నాటి సూక్ష్మజీవులు బయటికి వచ్చి కొత్త వ్యాధులు కమ్ముకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.
కాలం అదను మారె..
♦ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల చాలా ప్రాంతాల్లో వానాకాలం, చలికాలం తగ్గిపోతున్నాయి. ఎండాకాలం పెరిగిపోతోంది. భవిష్యత్తులో ఆరు నెలలు ఎండాకాలమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
♦అధిక ఉష్ణోగ్రతలు వల్ల ఆరుబయట పనిచేసుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ది లాన్సెట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇలా ఒక్క 2019 ఏడాదిలోనే 30వేల కోట్ల పని గంటలకు నష్టం జరిగింది.
♦వాతావరణ మార్పుల వల్ల రుతువుల సమయాల్లోనూ మార్పులు వస్తున్నాయి. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మార్చి నెల మధ్యలో వసంతకాలం మొదలవుతుంది. కానీ కొన్నేళ్లుగా ఫిబ్రవరి నెల మొదట్లోనే ఇది మొదలవుతోంది.
♦ హిమాలయాల ప్రాంతంలో ఉండే రోడోడెండ్రాన్ చెట్లు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో అంటే ఎండాకాలం మొదట్లో పూలు పూస్తాయి. కానీ కొన్నేళ్లుగా జనవరిలోనే పూస్తున్నాయి.
♦మామిడి చెట్లకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలే అనుకూలం. చలి, మంచు ప్రదేశాల్లో చెట్లు పెరిగినా పళ్లు కాయవు. కానీ శీతల ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా మామిడి పండ్లు కాస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే దీనికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment