పునర్జన్మ | reablement | Sakshi
Sakshi News home page

పునర్జన్మ

Published Sat, May 31 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

పునర్జన్మ

పునర్జన్మ

కథ
వృక్షాలు కనబరిచే విశ్వాసం - ఉత్తమం. జంతువులు కనబరిచే విశ్వాసం - మధ్యమం. మనుషులు కనబరిచే విశ్వాసం - అధమం.ఆ ఇంటి యజమాని రాఘవయ్య గేటువేపు నడుస్తున్నాడు. ఏదో మెడమీద పడింది. గొంగళిపురుగు అని తెలియగానే పడినచోట ఒక రకమైన దురద మొదలయ్యింది. మాటిమాటికీ తడుముకోవటం వల్ల ఆ భాగం వాచినట్లనిపించింది. కోపంగా పైకి చూశాడు. గొడుగులా విశాలంగా పరుచుకున్న ఆ మునగచెట్టు పడీ పడీ నవ్వుతున్నట్లనిపించింది. కేరింతలు కొడ్తూ, ఆకులు, పువ్వులు రాల్చింది. ఇంకా కోపంగా ఆ కొమ్మలవేపు చూస్తూ, గేటు దాటుకుని ఇంటి బయటకు నడిచాడు.
   
మునగ చెట్టుకూ, ఆ ఇంట్లో ఉంటున్నవారికీ కొణ్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది. అది పాతకాలపు భవంతి. అందులో మూడు వాటాలు. కింద రెండు, మొదటి అంతస్తులో ఒకటి. భవంతి ముందు విశాలమైన ఖాళీ జాగా. ఆ జాగాలో ప్రహరీనానుకుని ఇరవై ఏళ్ల క్రితం వేసిన మునగచెట్టు. ఆ చెట్టు విస్తరించి, విశాలమైన భవనం ముందు ఖాళీ జాగానంతటినీ కప్పేసింది.
 
 యజమాని రాఘవయ్య ఇరవై ఏళ్ల క్రితం ఎంతో దూరదృష్టితో మరేవో చెట్లు కాకుండా మునగచెట్టే నాటుకున్నాడు. మిగతా చెట్లు నీడనే ఇస్తాయి. మునగచెట్టు మాత్రం ఆకూ, పువ్వూ, కాయా అన్నీ ఉపయోగపడేవే! చివరకు మునగ బెరడును కూడా మందుల్లోకి వాడతారు. చింతచెట్లలాగా, ప్రతిభాగమూ ప్రయోజనకరమే! యజమాని ఆశించినదానికి ఏమాత్రమూ తీసిపోకుండా ఆ మునగచెట్టు దినదిన ప్రవర్ధమానమై, వృక్షంలా, ఏపుగా విస్తరించింది.
 
 కోసుకున్నవారికి కోసుకున్నంతగా ఆకూ, పువ్వూ, ములక్కాడలు అందజేస్తూ ఉంది. ఆ భవంతివాళ్లు ఏనాడూ, ములక్కాడలు కొని ఎరుగరు. దాన ధర్మాలకు పోగా, యజమానురాలు ఒక్కోసారి కూరగాయల బండి వాడిని 40-50 ములక్కాడల్ని రాల్చుకోనిచ్చి, బదులుగా ఆకుకూరలు, మరో రెండు మూడు కాయగూరలు తీసుకునేది.ఇంతటి ఉపయోగకరమైన చెట్టు వల్ల కూడా ఇబ్బందులుంటాయా? ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
   
 గ్రౌండ్ ఫ్లోర్ ముందు భాగంలో యజమాని రాఘవయ్య ఉంటాడు. ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యాడు. వెనక భాగం, పై అంతస్తు అద్దెకిచ్చాడు. అవే నేడు ఆయనకు ‘పెన్షన్’, ‘రికరింగు’ ఆదాయం! పిల్లలిద్దరూ, వాళ్ల ‘నిజ దారా సుతోదర పోషణార్థం’ వేరే దేశంలో స్థిరపడ్డారు.
 
  రాఘవయ్యకూ, ఆయన భార్యకూ వేరే పనులూ వ్యాపకాలూ ఏమీ లేవు. వారానికొకసారి పిల్లల నుండి వచ్చే ‘అతిదీర్ఘ’ ఫోను కాల్సు, టీవీలో ఎవరికిష్టమైన ప్రోగ్రాములు వాళ్లు చూడటం, పారాయణాలు, పక్కింటివాళ్లతో కబుర్లు వాళ్లకి కాలక్షేపం.
 వెనక వాటా రామారావుకు ఏదో బిజినెస్. స్కూళ్లకెళ్లే ఇద్దరు కుర్రాళ్లు ఆయన సంతానం. భార్య గృహిణి. రామారావు ఈ మధ్యే ఓ కారుకొన్నాడు.
 
  కొత్త కారు. పెపైచ్చు పెరిగిన పెట్రోలు ధరతో రోడ్డుమీద నిలిపి ఉంచే మోటర్ సైకిళ్లలోంచి పెట్రోలు తస్కరించడం తెలిసివుండటం వల్ల కారును రాత్రంతా వీధిలో ఉంచటానికి ఆయనకు మనస్కరించలేదు. ఇంట్లో పార్కింగు చేసుకోనిస్తే అదనంగా అద్దె ఇస్తానన్నాడు. పెపైచ్చూ కాంపౌండ్ గోడకు వెడల్పు గేటు తన ఖర్చుతోనే పెట్టిస్తానన్నాడు. కాంపౌండ్ గోడకు గేటు పెట్టాలంటే మునగచెట్టు అడ్డం వస్తోంది. అదనంగా వచ్చే అద్దె ఆదాయం రాఘవయ్యను ఆలోచనలో పడవేసింది.
   
 పనిమనిషికి యజమానురాలికి ఏదో వాగ్వాదం. ఆ వాగ్వాదపు సారాంశం. తాను ఇంటి లోపలి భాగం శుభ్రం చేస్తాను గాని బయట వాకిలి తన వల్ల కాదంటోంది. పెపైచ్చూ రోజూ నేలకు రాలుతోన్న ఆకూ, పూవు, చెత్తా చెదారం పక్షుల రెట్టలు, తన బాధ్యతల పరిధిలోకి రావని తేల్చేసింది.
 
 పైవాటాలోని శైలజ వచ్చింది. ఆవిడ ముఖం, చేతుల నిండా ఏవో దద్దుర్లు. తెల్లటి వంటిమీద ఎర్రటి మరకలు. బాల్కనీలో నించుంటే ఓ గొంగళిపురుగు బ్లవుజులోకి దూరిందట. ఎలర్జీ వచ్చి డాక్టరు చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతోందట. మునగచెట్టు కొట్టేయించాలనీ, లేకుంటే వాటా ఖాళీ చేస్తామనీ వార్నింగు ఇచ్చి వెళ్లింది. ఎటు వీలుంటే అటు ‘వీజీ’గా పార్టీ మార్చే రాఘవయ్య భార్య ‘నస’ ఎక్కువయ్యింది. ఏ పాయింటు మీద కచ్చితంగా నించోదు. మునగచెట్టు కొట్టేయించాలని రోజూ వారిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది.
 
 ‘‘ఆరోగ్యానికి మంచిదంటండీ! నెలకు కనీసం ఓసారైనా మునగాకు తినాలట’’ అంటూ వండే మునగాకు కూరా,  రుచిగా, వెరైటీగా ఉండే మునగపూవు కూర, అరగజంపైమాటే  ఉండి ములక్కాడలు వేసిన్నాడు సాంబారులోంచి వచ్చే ఘుమఘుమలు, అప్పుడప్పుడు కూరగాయల బండి వాడిచ్చే పాతికా, పరకా, ఇవేవీ ఆవిడకిప్పుడు గుర్తుకు రావటం లేదు. పెపైచ్చూ, ఇన్నాళ్ల నుండీ ఆ ఖాళీ జాగా గ్యారేజీకి ఇవ్వకుండా నష్టపోయాం అన్న పాయింటే ఆవిడ బుర్రలో మెదలటమే కాదు, రాఘవయ్యగారి బుర్రను కూడా ‘కడిగి’ వేసింది.
 
 ఏటా కాండాన్నాశించి కొన్ని రోజులు చీకాకు పరిచే గొంగళిపురుగులు, నూనె ముంచిన గుడ్డను ఓ కర్రకు కట్టి వాటిని కాల్చటం, ఒక్కోసారి ఆ గొంగళిపురుగులు పాక్కుంటూ ఇంట్లోకి రావటం లాంటి ఆలోచనలు ఆయన్ని కలచివేస్తున్నాయి. పొందిన మేలు మరిచే ఇంతమంది విలన్ల మధ్య సాధ్వీమణి లాంటి ఆ మునగచెట్టు ఒక్కర్తి ఏం చేయగలదు! పెపైచ్చూ, మనుషుల్లాగ పెంపుడు జంతువులకు లాగా చెట్లకు నోరు ఉండదాయె!
 చెట్టు కొట్టేయటానికి రాఘవయ్య మనసు ‘పీకినా’, ఆయన పక్షం ఆయన ఒక్కడే! చెవిలో జోరీగలా సందడిలాగా అభియోగాల ‘రొద’లో మునగచెట్టు తప్పుచేసిన దోషిలాగా, పట్టుబడ్డ నరహంతకిలాగా జడ్జి ఎదుట నించున్నట్లయింది. ‘ఇక తప్పదు’ అన్న నిశ్చయానికి రావల్సి వచ్చింది.
   
 చెట్టును కొట్టేసేవాళ్లొచ్చారు. ‘ఆపరేషన్’ అంతా అరగంటలో ముగిసింది. భూతం లాంటి ఇరవయ్యేళ్ల చెట్టు ముక్కలు ముక్కలై నేలకొరిగింది. ఇంట్లో వారు, వీధిలోవారు మునగాకు, మునగపూవు, మునక్కాడల్ని - లేతవీ ముదురువీ అని చూడకుండా కోసుకుపోయారు.
 
 బరిగల్లాంటి కొసలు, కాండం, మొద్దులు, ఎండిపోయిన మునగకాయలు, దాంట్లోంచి అమాయకంగా బయటకి తొంగిచూస్తున్న మునగవిత్తులు... వీటన్నింటినీ ఎత్తుకుపోయి ఎక్కడో పడేయటానికి కూలీలు అదనంగా డబ్బులు కావాలన్నారు. అదనంగా మరో అయిదు వందలు! రాఘవయ్యగారికి మనస్కరించలేదు. మొద్దులు, కొమ్మలు, రెమ్మలు గోడవారగా ఓ కుప్పగా వేసిపోయారు.
   
 చెట్టు అడ్డం లేని ఆకాశంలోంచి సూర్యుడు ఆ ఇంటివేపు తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడప్పుడు చెట్టుకింద ఓ కుర్చీ వేసుకుని కూర్చునే రాఘవయ్యగారికి ఎండ మండిపోతోంది. ‘‘ఇన్నాళ్లూ తెలీలేదు కాని, ములక్కాడ ఒక్కోటి రూపాయటండీ’’ రాఘవయ్యగారి భార్య ముక్తాయింపు. ఆరోగ్యానికి మునగాకు కూర లేదు. పొద్దునా సాయంత్రం పక్షుల అరుపుల్తో వాకిలంతా గోలగోలగా ఉండటం లేదు.
 
 శవం లేచిన ఇల్లులా ఏదో వెల్తి, వెల్లడి.ఉన్నప్పుడు తెలీని విలువ చెట్టుని కొట్టేశాక ఆ ఇంట్లోవాళ్లకు తెలియవస్తోంది. రాఘవయ్యకైతే మరీను. ఈ నేపథ్యంలో పనిమనిషి సణుగుడు, శైలజ ఎలర్జీ... ఇవేమీ సమస్యల్లా అనిపించటం లేదు. ‘నాలుగు డబ్బులెక్కువిస్తే పనిమనిషి నోరెత్తదు. శైలజ వాళ్లు కాకపోతే మరో కుటుంబం అద్దెకు వస్తుంది’ అన్న ఆలోచనలు కలుగసాగాయి ఆయనకు.అయినా ఇప్పుడేం చేయగలడు.
 
 ఏనుగు లాంటి మునగచెట్టు, పీనుగై నేల కూలింది. ‘గత జల సేతు బంధం’తో ప్రయోజనం ఉండదు కదా! ఆ క్షణాన రాఘవయ్యకు తన బాల్యం, వాళ్ల నాన్న గుర్తుకు వచ్చాడు. లంకంత జాగాలో, మధ్యన మూడే మూడు గదుల ఇల్లు! మల్లె, మందార, కరేపాకు, బాదాం, జామ, సపోటా, గన్నేరు, దానిమ్మ లాంటి పెద్ద చెట్లు, ఆకుకూరల మడులు.
 
 రాఘవయ్యగారి నాన్న పెందరాళే లేచి, భూపాలాలు పాడుతూ, ఇంట్లోవాళ్లు ఎవరో ఒకరు నీళ్లు తోడి పోస్తూంటే, అంగవస్త్రం కట్టుకుని చెట్ల మొదళ్ల ముందు గొంతుక్కూర్చుని కలుపు తీసేవాడు. కొంకి కర్రతో మొదళ్ల వద్ద నేల గుల్ల బార్చేవాడు. పువ్వులుడిగిన కొమ్మల్ని కత్తిరిస్తూనో, చీకిన ఎరుపు వేస్తూనో ‘బిజీ’గా ఉండేవాడు.
 
  ‘‘ఒరే! ఈ సమస్త జీవ జాలంలో ఇచ్చింది ఉంచుకోకుండా, మోసం చెయ్యకుండా రెట్టింపు తిరిగి ఇచ్చేవి చెట్లేరా!’’ అనేవాడు. తోట పనితో ఇంటిల్లిపాదికీ దేహ పరిశ్రమ జరిగేది. మొక్కల సంరక్షణ జరిగేది. కాసిన కొద్దిపాటి పూలు, కూర, నార, కాయ, పండు ‘మా ఇంట్లోని వండీ! మా నాన్న మీకిచ్చి రమ్మన్నాడు’ అని పొరుగువారితో అంటుంటే, తనకూ ఎంతో గర్వంగా ఉండేది!
   
 ఓ రెండు నెలలు గడిచాయి. రాఘవయ్య అదృష్టము బావుంది. ఎవరో ఒకాయన ఆ మునగచెట్టు మొద్దుల్ని ఉచితంగా ఎత్తుకుపోవటానికి ముందుకు వచ్చాడు. ఆనాటి బేరంతో చూస్తే రాఘవయ్య అయిదు వందలు ఆదా! అయినా కాసేపు బేరం చేసి, బెట్టు చేసి ఒప్పుకున్నారు.
 
 వచ్చినవారు లారీలోకి, మొద్దుల్ని ఎండిన బరిగల్ని ఎక్కించారు. సుమారు లారీ నిండింది. శవాన్ని ఎత్తుతుంటే కలిగే ఆవేదన లాంటిది రాఘవయ్యకు కలిగింది. ఆత్మీయులు పోయినంత బాధ ఆయన గొంతులో అడ్డం పడింది.ముంగిలి అంతా శుభ్రం అయింది. అటేపు చూడటానికి ఆయనకు మనస్కరించలేదు. అయినా ఓసారి తల తిప్పి చూశాడు. మొద్దుల్ని తీసేసిన చోట రెండడుగుల ఎత్తున్న ఆకుపచ్చని మొక్క గాలికి తన్మయత్వంతో ఊగుతున్నట్లుంది.
 
 అమ్మ పొదుగు దగ్గరి లేగదూడ చెంగలించినట్లు, పసిపిల్లాడు ఆనందంతో గంతులేసినట్లు, మొదటిసారి వెలుతురు చూస్తున్న ఆ మొక్క మెరిసిపోతోంది. అది మునగ మొక్కలా అనిపించింది.దగ్గరిగా వెళ్లి చూశాడు. అవును. అది మునగ మొక్కే! బలమైన ఆకుల్తో ఆకుపచ్చ, ఊదారంగు కలయిక గల కాండం, రెమ్మలతో, ఆ చిన్ని మొక్క తనని గుర్తుపట్టి నవ్వినట్లు అనిపించింది. ఇరవయ్యేళ్ల నాటి మొక్కకు ఇంకా రుణానుబంధం తీరినట్లు లేదు. మళ్లీ ప్రాణం పోసుకుంది.
 
 మునగమొక్కను చూసిన రాఘవయ్య మనస్సు చెంగలించింది. దగ్గరగా వెళ్లి పొదుముకున్నాడు. ఆత్మీయపు స్పర్శ కలిగిందాయనకు. ఆ చిన్ని మొక్క చుట్టూ గొప్పు కట్టి పిల్లలెవరూ పాడుచేయకుండా ‘దడి’ కట్టడానికి పలుగు, పార తేవటానికి ఇంటివైపు అడుగులు వేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement