hot waves
-
AP: జర జాగ్రత్త.. మూడు రోజులు మండే ఎండలే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత పెరగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.ఇక, రానున్న మూడు రోజుల్లో ప్రతీరోజు ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో అత్యధికంగా 42.2, నంద్యాలలో 42 డిగ్రీలు, అనంతపూర్‌లో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలో సాధారణ కంటే 2.6 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న(సోమవారం) రికార్డు అయ్యింది. ఇక, రాష్ట్రంలో విశాఖలోనే అత్యల్పంగా 31.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు.. సోమవారం అనకాపల్లి, విజయనగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి. మంగళ, బుధవారాల్లో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. సోమవారం ఆరు మండలాల్లో తీవ్రవడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
మరో నాలుగు రోజులు నిప్పులే!
నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 28 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రజల్ని అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సూచించింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో 47.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాక్షి, అమరావతి: నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది. ‘రాబోయే నాలుగు రోజులే కాదు. నైరుతి రుతు పవనాలు వచ్చే వరకూ చాలా రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని వాతావరణ నిపుణులు సూచించారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో నిప్పుల కొలిమిని తలపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలు నమోదైంది. 3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలా.. ► మే 25న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ► మే 26న విజయనగరంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాలు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ పట్నం, చిత్తూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ► మే 27న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 44 నుంచి 45 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 38 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ► రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బ లక్షణాలు ► తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించడం ► తీవ్రమైన జ్వరం ► ఒళ్లంతా చెమటతో తడిసిపోవడం ► మూర్ఛ (ఫిట్స్)తో గిలగిలా కొట్టుకోవడం ► కొద్దిగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం. వడదెబ్బకు చికిత్స ► నీడ ఉన్న చల్లని ప్రాంతానికి చేరవేయాలి. ► శరీరమంతా చల్లని తడి వస్త్రంతో తుడవాలి. ► శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే దిగువకు వచ్చే వరకూ చల్లటి వస్త్రంతో తుడవాలి. ► బాగా గాలి అందేలా చూడాలి. ► సాధారణ స్థితికి చేరుకోని పక్షంలో వెంటనే ఆస్పత్రికి తరలించాలి. -
అగ్గి తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిగుండంగా మండుతోంది! ముగింపు దశలో ఉన్న రోహిణి కార్తె రాష్ట్ర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇంటి నుంచి అడుగు బయటకు వేస్తే వడగాడ్పులు ఠారెత్తిస్తుండగా ఇంట్లోని ఫ్యాన్ గాలి సైతం ఎండల తీవ్రతకు సుర్రుమంటోంది. సాయంత్రం ఆరు గంటలు దాటినా ఎండ వేడి ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో వడదెబ్బకు తెలంగాణలో ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఏప్రిల్ ఒకటి నుంచి మే 27 వరకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 36 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. 205 మండలాల్లో తీవ్రమైన వడగాడ్పులు నమోదయ్యాయి. దీంతో జనం అల్లాడి పోతున్నారు. పొడిగాలులు, సుదీర్ఘ వడగాడ్పుల వల్లే.. వాయవ్య, ఉత్తర దిక్కు నుంచి పొడిగాలులు తెలంగాణపైకి వీస్తుండటం, సుదీర్ఘమైన వడగాడ్పుల రోజులు నమోదు కావడంతో తెలంగాణలో పరిస్థితి దయనీయంగా మారింది. రాజస్తాన్, మహారాష్ట్రలోని విదర్భ వంటి ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, భూమండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో తెలంగాణ కూడా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానంగా జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌లలో వడగాడ్పుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. గత సోమవారం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 47 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే 25న అత్యధిక ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలుండగా మరుసటి రోజుకు మరింత పెరిగింది. గత ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 47.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 121 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచలంలో 1952 జనవరి 29న 48.6 డిగ్రీలు నమోదు కాగా, రెండో అత్యధిక ఉష్ణోగ్రత హన్మకొండలో 1898లో 47.8 డిగ్రీలు నమోదైంది. తాజాగా నీల్వాయిలో నమోదైంది. మే 26న థార్ ఎడారిలో 43.3 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్‌లో 43.4 డిగ్రీలు నమోదైంది. గత ఆదివారం వరంగల్ అర్బన్‌లో 46.9 డిగ్రీలు, సిరిసిల్లలో 46.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 46.4 డిగ్రీలు, మంచిర్యాలలో 46.1 డిగ్రీలు, భద్రాద్రి, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 46 డిగ్రీల చొప్పున, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీలు, వరంగల్ రూరల్‌లో 45.1 డిగ్రీలు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 45 డిగ్రీల చొప్పున, వికారాబాద్‌లో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డేంజర్ జోన్లో తెలంగాణ... దేశంలోనే అధికంగా వడగాడ్పులు వీచే డేంజర్ జోన్లో తెలంగాణ ఉంది. దీనివల్ల రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో కొన్నిచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో రుతుపవనాలు వచ్చే వరకు కూడా వడగాడ్పులు నమోదయ్యే అవకాశాలున్నాయి. 2016 వేసవిలో 27 రోజులు వడగాడ్పులు నమోదవగా ఈసారి ఇప్పటికే 36 రోజులు నమోదు కావడం గమనార్హం. అయితే ఎంత ఎండ ఉన్నా రోజువారీ పనులు, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రజలు నిత్యం బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఎక్కువ మంది పేద, మధ్యతరగతి ప్రజలు ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తారు. ఉపాధి కూలీలు ఎండలోనే పనిచేయాలి. ఎండలు దంచికొడుతున్నా పని మానుకునే పరిస్థితి ఉండదు. దీంతో వేలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వడదెబ్బ బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. 10న రాష్ట్రానికి రుతుపవనాలు... ఈ నెల పదో తేదీ నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి శుక్రవారం వెల్లడించారు. కేరళలోకి ఈ నెల 6న రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. లానినో ప్రభావం రోజురోజుకు తగ్గుతుందని, దీనివల్ల వచ్చే సీజన్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్నారు. -
నిప్పుల కొలిమి
– డోన్‌లో అత్యధికంగా 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు – రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఎండలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. జాతీయ రహదారుల పొడవునా ఎండమావులు నీటి కుంటలను తలపిస్తున్నాయి. వాహన చోదకుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వడదెబ్బ బారిన మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 30కి పైగా ఉండటం గమనార్హం. ఏప్రిల్ నెల మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం డోన్‌లో 45.14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, నందవరం తదితర మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు పట్టణాల్లో ముఖ్యమైన రహదారులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇలా.. ప్రాంతం ఉష్ణోగ్రతలు డోన్ 45.14 నందికొట్కూరు 44,6 నందవరం(నాగులదిన్నె) 44.01 మద్దికెర 43.74 చాగలమర్రి 43.66 పగిడ్యాల 43.54 కర్నూలు(బుధవారపేట) 42.33