సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. అల్లూరి జిల్లాలోని నెల్లిపాక, చింతూరు, కూనవరం, వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, ఏలూరు జిల్లా కుక్కునూరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని తెలిపారు. మరో 256 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందన్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 42–44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు.
20 జిల్లాల్లో 42–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు
మరోవైపు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండాయి. 20 జిల్లాల్లో 150 మండలాలకు పైగా 42–45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. పల్నాడు, కృష్ణా, ఏలూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, కాకినాడ, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా రావిపాడులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లా ఈపూరు, విజయనగరం జిల్లా కనిమెరకలో 44.9 డిగ్రీలు, ఏలూరు జిల్లా శ్రీరామవరం, ఈదులగూడెంలో 44.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో 44.8 డిగ్రీలు, బాపట్లజిల్లా వల్లపల్లిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఆయా ప్రాంతాల్లో 50 డిగ్రీలకు పైగా ఉష్ణతీవ్రత ఉన్న అనుభూతి కలిగింది.
ఉదయం తొమ్మిది గంటలకే పలుచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలా సాయంత్రం ఐదు గంటల వరకూ అదే తీవ్రత కొనసాగింది. వడగాడ్పుల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. అలాగే, గాలిలో తేమ అధికంగా ఉండడంతో ఉక్కపోత కూడా జనాన్ని ఇబ్బందిపెడుతోంది. ఈనెల 8 వరకు వడగాడ్పుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో సాధారణంకంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అదే సమయంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు సంభవించే అవకాశముందని, గంటకు 40–50 కి.మీల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వివరించింది.
విస్తరిస్తున్న రుతుపవనాలు
ఇక నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు కొమరిన్‌లోని అన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో మరింత విస్తరించే అవకాశముందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఏపీలో పుష్కలంగా కరెంటు
Comments
Please login to add a commentAdd a comment