
పనులకు పిలవొద్దు.. హోటళ్లలో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వొద్దు..
కిరాణా కొట్లలో పాలు, సరుకులు కూడా విక్రయించొద్దు
దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయండని కోరినందుకే..
అధికారుల విచారణలో గోడు వెళ్లబోసుకున్న బాధితులు
పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో ఓ చిన్న కారణానికి దళితులు సాంఘిక బహిష్కరణకు గురైన సంఘటన ఆదివారం వెలుగులోకి వచి్చంది. స్థానికులు, అధికారుల కథనం ప్రకారం.. మల్లాంలో వెలిశెట్టి జల్లిబాబు ఇంట్లో అదే గ్రామానికి చెందిన దళితుడు పల్లపు సురేష్ (37) ఈ నెల 16న కరెంటు పని చేస్తూ, విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సురేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈ నెల 17న దళితులు ధర్నా చేశారు. ఇరు వర్గాల సమక్షంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు సమావేశమై, దళితులపై సాంఘిక బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.
కొందరు పెద్దల నిర్ణయం మేరకు తమను పనిలోకి పిలవడం లేదని, ఎవరూ పాలు పోయడం లేదని, హోటళ్లలో కూడా పాలు, టిఫిన్, టీ, కాఫీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తమను సాంఘిక బహిష్కరణ చేశారని పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
మాకు ఇబ్బంది రాకూడదనే అలా..
‘మా పొలాలు, వ్యాపారాల్లో దళితులు పని చేస్తున్నారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మాపై తప్పుడు కేసులు పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. దీంతో వాళ్లకు ఏ పనీ చెప్పకపోతే ఇబ్బంది ఉండదు కదా అని ఒక నిర్ణయం తీసుకున్నాం’ అంటూ రెండో వర్గం వారు అధికారుల వద్ద స్పష్టం చేశారు. దళితుల సాంఘిక బహిష్కరణ విషయంపై కాకినాడ ఆర్‌డీఓ ఎస్.మల్లిబాబు, పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై జాన్‌బాషా దళిత కాలనీలోని బాధితులను విచారించారు.
ఈ సందర్భంగా కాల్దరి భాస్కరరావు మాట్లాడుతూ.. ఆదివారం గ్రామంలో యథావిధిగా చేపలు అమ్మేందుకు ప్రయతి్నంచగా బుర్రా రాంబాబు, మేడిది రాజారావులు తన వద్ద ఎవరూ చేపలు కొనొద్దని చెప్పారన్నారు. కలగపూడి ఆమోష్ మాట్లాడుతూ.. బుర్రా నాని, బుర్రా మణికి చెందిన రెండు హోటళ్లలో టిఫిన్ కోసం వెళ్లగా తమకు విక్రయించబోమని చెప్పారన్నారు.
ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ.. మలిరెడ్డి రాంబాబు దుకాణంలో టీ ఇవ్వలేదని, తమకు టీ అమ్మవద్దని వారి పెద్దలు చెప్పారని తెలిపారన్నారు. కాల్దారి శ్రీను మాట్లాడుతూ.. చల్లా వెంకట రమణ పాల కేంద్రం వద్ద పాలు పోయలేదని చెప్పారు. అనంతరం ఆర్డీవో ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.