
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన.
ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు.
కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది.

ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.