
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!.
అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు.
వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.
వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.
ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది.
ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది.
వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు.
:::సిమ్మాదిరప్పన్న