
ఊరూ పేరు లేని కంపెనీలకు ఖరీదైన సర్కారు భూములా?
ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందం కాదా?
సోషల్ మీడియాలో కూటమి సర్కారును నిలదీస్తున్న న్యాయ కోవిదులు, రాజకీయ పరిశీలకులు
సాక్షి, అమరావతి: ఊరూ పేరు లేని ఉర్సా కంపెనీకి టీడీపీ సర్కారు విశాఖలో రూ.3,000 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములను ఎకరా 99 పైసలకే కేటాయించిన నేపథ్యంలో ఈ కుంభకోణం జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. భూ కేటాయింపులపై చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను న్యాయ నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఒకపక్క కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రూ.కోట్లలో వసూలు చేస్తూ... మరోపక్క తన బినామీలు, వందిమాగదులకు కారుచౌకగా సంతర్పణ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత పది రోజులుగా ఉర్సా భూ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూటమి సర్కారుతోపాటు అనుకూల మీడియా కిక్కురుమనకపోవడం ఆరోపణలకు మరింత బలం చేకూరుతోందని పేర్కొంటున్నారు.

చంద్రబాబు సర్కార్‌ను ప్రశ్నిస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన పోస్టు
ఉర్సాకు భూ కేటాయింపులు చట్ట విరుద్ధం: ప్రశాంత్ భూషణ్
ఓ ఘోస్ట్ కంపెనీకి చంద్రబాబు సర్కారు చట్ట విరుద్ధంగా 59.6 ఎకరాలను కేటాయించిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కనీసం ఆఫీసు, ఎలాంటి ట్రాక్ రికార్డు లేని కంపెనీతో ప్రభుత్వం ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని ప్రశ్నించారు. ఇలాంటి దొంగ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఉచితంగా భూమి ఇచ్చిందని, ఇది కిక్ బ్యాక్స్ ఒప్పందమా? లేక ఉన్నతస్థాయి నాయకుల సంబంధమా? అని ప్రశ్నించారు.
ఉర్సా ఎవరి క్లస్టర్?: తెలకపల్లి రవి
ఉర్సా క్లస్టర్‌కు భూ కేటాయింపులపై చాలా సందేహాలున్నాయని, అది ఎవరి క్లస్టర్ అన్నది తేలాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తన యూట్యూబ్ చానల్‌లో పేర్కొన్నారు. ‘రెండు నెలల కిందట ఏర్పాటైన ఉర్సా క్లస్టర్ ప్రైవేటు లిమిటెడ్‌కు దాదాపు 60 ఎకరాల భూమిని కేటాయించారు. ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్‌తో పాటు ఐటీ, ఏపీఐఐసీ విభాగాలు, సోషల్ మీడియా వింగ్ స్పందించడం లేదు. ఉర్సా కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు ఉన్నాయి. తెలంగాణ పత్రికలు ఈ విషయాన్ని ప్రముఖంగా ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం మీడియా మౌనంగా ఉండటం చాలా సందేహాస్పదంగా ఉంది. 2014–19లో కూడా టీడీపీ ప్రభుత్వం తన సన్నిహితులకు చాలా విలువైన భూములను ధారాదత్తం చేసింది’ అని పేర్కొన్నారు.
అదే నిజమైతే కేటాయింపులు ఆపాలి: కె.నాగేశ్వరరావు
ఊరూ పేరులేని కంపెనీకి, లోకేశ్ బినామీలకు భూకేటాయింపులు చేశారన్న ఆరోపణలు నిజమైతే ఉర్సాకు భూ కేటాయింపులను తక్షణం ఆపాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘మా యూట్యూబ్ ఛానల్‌కు 99 పైసలకు విశాఖలో కనీసం ఒక ఎకరా ఇవ్వమని చెప్పండి. ఉర్సా.. టీసీఎస్ కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తా. పది పైసలకు పది గుంటలు ఇచ్చినా యూట్యూబ్ చానల్‌ను విస్తరించి పెద్ద మీడియా సంస్థ ఏర్పాటు చేస్తా.
ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు భూములు విక్రయించడం ద్వారా హక్కులు వదులుకోకూడదు. ఫిబ్రవరిలో ఏర్పాటైన ఉర్సా కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయిస్తారు? ఉర్సాపై ఇంత దుమారం రేగుతున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? లోకేశ్ బినామీ కిలారు రాజేష్ సంస్థకు భూములు కేటాయించారంటున్నా ఎందుకు స్పందించడం లేదు?’అని తన యూ ట్యూబ్ చానల్‌లో పేర్కొన్నారు.