కూటమి శ్రేణులకే పనులు చేయాలి | Chandrababu Says TDP Jana Sena BJP Should Move Forward Together And Comments On Welfare Schemes To YSRCP Activists | Sakshi
Sakshi News home page

కూటమి శ్రేణులకే పనులు చేయాలి

Published Wed, Mar 5 2025 4:27 AM | Last Updated on Wed, Mar 5 2025 9:36 AM

TDP Jana Sena BJP should move forward together says Chandrababu

వైఎస్సార్‌సీపీ నేతలను దగ్గరకు రానివ్వొద్దు

పునరుద్ఘాటించిన సీఎం చంద్రబాబు

టీడీపీ, జనసేన, బీజేపీ సమష్టిగా ముందుకెళ్లాలి 

అలాగైతేనే రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం రాదు 

తెలంగాణలో వర్షం నీటిని నిలుపుకోలేకే విజయవాడ మునక  

సాక్షి, అమరావతి : కూటమి పార్టీల నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పనులు చేయాలని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొందరు టీడీపీ, కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మేలు చేస్తున్నట్లు తెలుస్తోందని, అలా చేయొద్దని తేల్చి చెప్పారు. మొన్న చిత్తూరు జిల్లాలో ఈ మాట చెప్పినందుకు వైఎస్సార్‌సీపీ నేతలు గుంజుకుంటున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలు లంచాలు ఇచ్చి, అవినీతి పనులు చేసుకోవాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వారిని దగ్గరకు రానివ్వొద్దని స్పష్టం చేశారు. 

కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజల్లో ఉంటే భవిష్యత్తులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉండదని, శాశ్వతంగా ఎన్డీయేనే గెలుస్తుందని అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం రాత్రి విజయోత్సవ సభ నిర్వహించారు. 

ఈ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కలిసి పని చేస్తే కూటమికి తిరుగుండదన్నారు. అధికారంలోకి వచ్చాక విజయం కోసం పని చేసిన వారిని విస్మరించకూడదన్నారు. తమపై చాలా బాధ్యతలు ఉన్నాయని, నాలుగవసారి సీఎం అయ్యానని, అన్ని విధాలా దోపిడీకీ గురైన రాష్ట్ర పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని చెప్పారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామని, ఖజానా చూస్తే దిక్కుతోచడం లేదన్నారు. గత ఎన్నికల్లో 57 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు 63 శాతానికి ఓటు శాతం పెరిగిందని తెలిపారు.

బనకచర్లపై అభ్యంతరం చెప్పొద్దు
పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, సముద్రంలోకి పోయే వృథా నీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దని తెలంగాణను కోరారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదంటున్నారని, తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నేను ఎక్కడా, ఎప్పుడూ వ్యతిరేకించలేదని, పైగా స్వాగతించానని తెలిపారు. ఏటా 1000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, రాజకీయ నేతలు పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. 

మోదీ దేశాన్ని నడిపిస్తే తాను తెలుగుజాతిని అగ్ర జాతిగా చేయాలనుకుంటున్నానని చెప్పారు. తెలంగాణలో వర్షం నీటిని వారు నిలబెట్టుకోలేక పోవడం వల్లే ఆనీరొచ్చి పడి విజయవాడ మునిగిందన్నారు. ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ రెడ్‌ బుక్‌ పని మొదలైందని, దాని పని అది చేసుకుంటూ పోతోందన్నారు. రెడ్‌ బుక్‌ గురించి గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చే కార్యక్రమం మొదలైందన్నారు. తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. ఈవీఎం అయినా, బ్యాలెట్‌ అయినా ప్రతి ఎన్నికల్లో కూటమిదే విజయం  అన్నారు. 

సీఎం నోట ఆ మాటలేంటి?
రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాబు మాటలపై కూటమి పార్టీల నేతలే విస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరి బాగోగులు చూడాల్సిన బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిదని చెబుతున్నారు. 

గత ప్రభుత్వంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం.. ఇవేవీ చూడకుండా కేవలం అర్హత ప్రాతిపదికగా సంక్షేమ పథకాలు అందాయని ముక్త కంఠంతో జనం చెబుతుంటే, చంద్రబాబు మాత్రం పూర్తిగా కక్ష సాధింపుతో ముందుకెళ్తుండటం దారుణం అని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీ­యాలని, ఆ తర్వాత అంతా తన వాళ్లేనని గత సీఎం వైఎస్‌ జగన్‌ పదే పదే చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని గుర్తు చేస్తు­న్నారు. 

చంద్రబాబు మొన్న చిత్తూరు జిల్లాలో ఈ వ్యాఖ్య­లను పొరపాటున చేశారనుకుంటే.. ఈ రోజు వాటిని మరీ గుర్తు చేయడం కక్ష సాధింపునకు నిదర్శనమని తేలిపోయిందంటున్నారు. బాబు తీరుతో రాజకీయాలు మరింత భ్రష్టు పట్టడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement