
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.
దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.
‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు.
..చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్‌ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి

..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసు
కుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?
ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్‌లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాం
మద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.