
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసాలు విన్నా.. చదివినా రక్తపోటు, మధుమేహం గ్యారెంటీ అనిపిస్తోంది. కించపరచాలన్న ఉద్దేశం కాదు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అబద్ధాలకు, అతిశయోక్తులకు అంతు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ విషయంలో ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవు. స్వోత్కర్ష వరకూ ఓకే గానీ.. మితిమీరితే అవే ఎబ్బెట్టుగా మారతాయి.
కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం మూడు మతాలను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. కూటమి సర్కారు పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏనాడైనా జగన్ మతపరమైన అంశాలు మాట్లాడారా? లేదే! కానీ జగన్ ఫోబియాతో బాధపడుతున్న చంద్రబాబు మాత్రం ప్రతిదానికీ మాజీ సీఎంపై అభాండాలు వేసేస్తున్నారు. ఈ తీరు చూసి ఆయన కేబినెట్ మంత్రులే విస్తుపోతున్నట్లు కథనాలు వచ్చాయి. జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు.. అంటూ సీఎం ప్రశ్నిస్తున్నారని ఒక మంత్రి వాపోయారట.
తిరుమల గోవుల మరణాలపై భూమన కరుణాకర రెడ్డి వెలుగులోకి తీసుకు వచ్చిన విషయాలపై ఎందుకు మాట్లాడడం లేదని సీఎం అన్నారట. టీటీడీ ఛైర్మన్, ఈవో, సీఎం తలా ఒక్కోలా మాట్లాడుతూంటే వాటిల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకుని తాము మాట్లాడాలని ఒక మంత్రి తన సన్నిహితులతో వాపోయినట్లు సమాచారం. గోవులేవీ చనిపోలేదని సీఎం చెబుతూంటే.. వృద్ధాప్యంతో 23 ఆవులు మరణించాయని టీటీడీ ఛైర్మన్, 43 ఆవులు చనిపోయాయని ఈవో చెబుతున్నారని దీన్నిబట్టి చూస్తే సీఎం అబద్ధమాడినట్లే కదా అని మంత్రులు కొందరు ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డితో అబద్ధాలు చెప్పించారని చంద్రబాబు ఆరోపిస్తూన్నారు. భూమన ఎవరైనా చెబితే మాట్లాడే వ్యక్తేనా? తను నమ్మితే, ఆధారాలు ఉంటేనే మాట్లాడతారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అందువల్లే ఆయన ధైర్యంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేసిన సవాల్‌ను స్వీకరించి తన ఆరోపణలను రుజువు చేయడానికి సిద్దమయ్యారు. పల్లా అసలు తిరుపతి రాకుండా ముఖం చాటేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, వారి మనుషులు గోశాల వద్దకు వెళ్లి హడావుడి చేసి భూమన రావడం లేదని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే భూమనను పోలీసులు అడ్డుకోవడం, గృహ నిర్భంధం చేయడం అందరు చూశారు.
టీడీపీ నిస్సిగ్గుగా డబుల్ గేమ్ ఆడిన విషయం బహిర్గతమైంది. భూమన తిరుమల గోవుల, లేగ దూడల మరణాల గురించి ఆధార సహితంగా బయటి ప్రపంచానికి తెలియ చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దానిని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు అసలు గోవుల మరణాలు జరగలేదని అబద్దం చెప్పారన్నది చాలామంది భావన. దానిని టీటీడీ చైర్మన్, ఈవోలే నిర్థారించారు. దాంతో ఏమి చేయాలో పాలుపోని స్థితి చంద్రబాబుకు ఏర్పడింది. అయినా టీడీపీలో అందరూ తన వాదననే ప్రచారం చేయాలన్నది సీఎం ఉద్దేశం కావచ్చు. ఇలాంటివి విన్నా, చదివినా ఎవరికైనా రక్తపోటు రాకుండా ఉంటుందా?. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర అని ఆయన అంటున్నారు.
అసలు అలాంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబుకు ఉన్నంత సమర్ధత మరెవరికైనా ఉంటుందా అన్నది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్‌పై ఒక పచ్చి అబద్దాన్ని ప్రచారం చేశారే. వెంకటేశ్వర స్వామి తన ఇంటి దైవం అని చెప్పుకుంటూనే, తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించి తీరని అపచారం చేశారే! పోనీ అది నిజమని ఇంతవరకు ఎక్కడైనా రుజువు చేశారా? ఈ విషయంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచామన్న కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారే?. నిజంగా దైవ భక్తి ఉన్నవారెవరైనా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా?. పవన్ కళ్యాణ్ కూడా ఆయన దారిలోనే పిచ్చి ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకున్నారే! లడ్డూ వివాదాన్ని ఎలాగొలా జగన్‌కు అంటగట్టాలని విశ్వయత్నం చేశారే. కాని విఫలమయ్యారే. ఆ తర్వాత అయినా చేసిన పాపం కడుక్కోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే లేదే !
జగన్ టైమ్‌లో ఏ చిన్న విషయం దొరికినా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద ఆలయ రథం దగ్దమైతే బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు రచ్చ చేశారు. అయితే జగన్ సీబీఐ విచారణకు ఓకే చేస్తే కేంద్రం ఎందుకు సిద్దపడలేదు? రికార్డు సమయంలో కొత్త రథాన్ని తయారు చేయించిన జగన్ మతాల మధ్య ద్వేషం పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలే ఆలయాలపై దాడులు చేస్తే, దానిని కప్పిపుచ్చి జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఆ రోజుల్లో కూటమి పార్టీలు ఎంత ప్రయత్నించి తెలియనిది కాదు. తన హయాంలో విజయవాడ తదితర చోట్ల నలభై గుడులను పడగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే హిందూ మతోద్దారకుడిగా ప్రచారం చేసుకున్నారు.
జగన్‌పైనే కాకుండా, ఆనాటి డీజీపీపై కూడా క్రిస్టియన్ మత ముద్ర వేసి ప్రజలలో ద్వేషం పెంచడానికి యత్నించారా? లేదా? తిరుమలలో ఏ చిన్న ఘటన జరిగినా జగన్ పై నెట్టేయడమే పనిగా పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు తిరుమలలో మద్యం అమ్ముతున్నా, బిర్యానీలు తెచ్చుకుంటున్నా, చెప్పులు వేసుకుని గుడి వరకు వెళుతున్నా, ఏమి తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక చర్చిపై హిందూ మత రాతలు కనిపించాయి. వెంటనే హోం మంత్రి దానిని వైసీపీపై ఆరోపించారు. తీరా చూస్తే ఇద్దరు పాస్టర్ ల మధ్య గొడవలలో ఆ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరి దీనికి చంద్రబాబు ఏమి బదులు ఇస్తారు? ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో ఇలా మతపరమైన వివాదాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. చంద్రబాబు చేతిలోకి టీడీపీ వచ్చాక అధికారం కోసం ఎలాంటి ద్వేషాన్ని అయినా రెచ్చగొట్డడానికి వెనుకాడరన్న అభియోగాలు ఉన్నాయి.
వక్ఫ్ బిల్లుపై జగన్ రాజకీయం చేస్తున్నారట. ఇది విన్నవారికి ఏమనిపిస్తుంది? వైసీపీ అంత స్పష్టంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించినా, పచ్చి అసత్యాలను ప్రచారం చేయడానికి టీడీపీ ఏ మాత్రం సిగ్గుపడడం లేదని అనిపించదా? తాజాగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది కదా? అసలు వక్ఫ్ చట్టంపై చంద్రబాబు, పవన్‌ల వైఖరి ఏమిటి అన్నది ఇంతవరకు చెప్పారా? ఒకప్పుడు ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేస్తూ ముస్లింలను బతకనివ్వడని, తలాఖ్ చట్టం తెచ్చారని ఆరోపించిన చంద్రబాబు బతిమలాడుకుని మరీ బీజేపీతో ఎలా జతకట్టారు? పోనీ ఇప్పుడు వక్ప్ చట్టాన్ని ఏపీలో అమలు చేయబోమని చెప్పగలరా? లేదా సుప్రీం కోర్టు విచారణలో ఇంప్లీడ్ అవ్వగలరా? అటు బీజేపీకి మద్దతు ఇవ్వాలి. ఇటు ముస్లింలను మోసమో, మాయో చేయాలని ప్రయత్నించడం చంద్రబాబుకే చెల్లుతుంది. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలను మోసం చేశారని విమర్శించారు.
ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై కూడా వైసీపీ మీద ఆయన ఆరోపణలు చేశారు. ఈ పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయకుండా ప్రభుత్వం ఎందుకు దబాయించే యత్నం చేస్తున్నదీ ఎవరికి అర్థం కాదు. దీనిపై ఒక రిటైర్డ్ ఐఎఎస్‌తో సహా పలువురు వేస్తున్న ప్రశ్నలకు పోలీసు అధికారులు జవాబు ఇస్తున్నట్లు అనిపించదు. సీసీటీవీ దృశ్యాలపై కొందరు తమ అనుమానాలను తెలియచేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ కాని, వైసీపీ నేతలు ఎవరూ ఈ అంశం జోలికి వెళ్లకపోయినా, తాను ఇబ్బంది పడినప్పుడల్లా జగన్ పై తోసేసి కథ నడిపించాలన్నది చంద్రబాబు వ్యూహం.
జగన్ టైమ్‌లో ఒక డాక్టర్ మద్యం మత్తులో రోడ్డుపై నానా యాగీ చేస్తే అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుల్ అతని రెక్కలు కట్టి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. అంతే! అదేదో జగనే దగ్గరుండి చేయించినట్లుగా దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ విషయంలో మాత్రం తాను చెప్పిందే రైటు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. కులపరమైన, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ఢిల్లీలో కూర్చుని టీవీలలో లైవ్ లో మాట్లాడిన ఒక నేతకు ఇదే చంద్రబాబు పెద్ద పదవి ఇచ్చారే!
నిజానికి మతపరమైన అంశాలకు ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తే అంత మంచిది. కాని ఒకప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని, మత తత్వ పార్టీ అని ప్రచారం చేసిన చంద్రబాబు, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని, ఎదుటివారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే ఏమనిపిస్తుంది. హేతుబద్దంగా ఆలోచించేవారికి ఎవరికైనా చంద్రబాబు ఇలాంటి నీతులు చెబుతున్నప్పుడు వినాలంటే బీపీ రాకుండా ఉంటుందా!
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత