ఏపీలో శాంతిభద్రతల సమస్యపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గట్టిగానే స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన సరైన హెచ్చరికనే పంపారని భావించాలి. రెండు నెలలుగా ఏపీలో సాగుతున్న అరాచకాలకు పుల్ స్టాప్ పెట్టవలసిన చంద్రబాబు ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తోంది. తనది రాజకీయ పాలనే అని చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెబుతుంటే, ఆయన పార్టీ నేతలు, దానిని ఆచరణలో చేసి చూపుతున్నట్లుగా ఉంది. రాజకీయ ప్రత్యర్దులను కొట్టడం, హతమార్చడం, వైఎస్సార్‌సీపీవారి ఆస్తులను ధ్వంసం చేయడం తదితర అకృత్యాలకు పాల్పడడమే రాజకీయ పాలన అని టీడీపీ నేతలు భావిస్తున్నట్లుగా ఉంది.
రాష్ట్రంలో దిగజారిన ఈ పరిస్థితులు కొన్ని ఇతర దేశాలలో కూడా చర్చనీయాంశం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మానె, తమను బతకనిస్తే చాలు అనే చందంగా ప్రజలు భయపడే వాతావరణం ఏర్పడింది. నంద్యాల వద్ద జరిగిన హత్య కాని, జగ్గయ్యపేట వద్ద జరిగిన దాడి కాని, ఇలా ఒకటేమిటి! రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న హింసాకాండకు అంతు, పొంతు లేకుండాపోతోంది. మరో వైపు బాలిలకపై జరుగుతున్న ఘోరాలు అంతకంతకు మించిపోతున్నాయి. ఇవన్ని నిత్యం వార్తలలో వస్తూనే ఉన్నాయి. కాకపోతే చంద్రబాబుకు, హోం మంత్రి అనిత వంటివారికి సాక్ష్యాలు కావాలట. ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చి ఇవ్వాలట. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి వాటిలో ఈ వార్తలు వచ్చేలా చూసుకుంటేనే ప్రభుత్వం, పోలీసులు స్పందిస్తారేమో అనే అనుమానం సర్వత్రా వ్యాపించింది.
ఆ రెండు మీడియాలలో వార్తలు రాకపోతే హత్యలు జరిగినా జరగనట్లే! దాడులు జరిగినా జరగనట్లే! అత్యాచారాలు సాగిపోతున్నా లేనట్లే! వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో చీమ చిటుక్కుమన్నా నానా రచ్చ చేస్తూ గగ్గోలు పెట్టిన ఇదే మీడియాకు ఇప్పుడు రాష్ట్రంలోని హింసగీతిక శ్రవణానందంగా ఉన్నట్లు అనుకోవాలి. ఈ మీడియా సంగతి పక్కనబెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపీఎస్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎప్పటికైనా మెరుగుపడుతుందా అనే డౌటు వస్తుంది. గత రెండు నెలల్లో సాగిన హింసపై డీజీపీని నివేదిక కోరవలసిన ఆయన, అసలు రాష్ట్రంలో ఏమీ జరగనట్లు మాట్లాడారు. ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ వారు చేసిన ధర్నాను తప్పుపడుతూ ముప్పైఆరు మంది హత్యకు గురైనట్లు ప్రచారం చేశారని, అది నిజమే అయితే ఎఫ్ఐఆర్‌లు తెచ్చి ఇస్తే కేసులు దర్యాప్తు చేస్తామని అంటున్నారు.
అంటే ఏమిటి దీని అర్ధం. ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని చెప్పడమా? లేక ఆ కేసులను పట్టించుకోవద్దని సూచించడమా? నిజంగా టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ దారుణాలతో సంబంధం లేకపోతే పోలీసు ఉన్నతాదికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారు కదా! ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఉపేక్షించవద్దని చెప్పేవారు కదా! అలా అనకపోగా, గత ఐదేళ్లు రాజకీయ రౌడీయిజం జరిగిందని ఆరోపించారు. అప్పుడు ఏమి జరిగిందో కాని, ఇప్పుడు జనం అంతా చూస్తూ ఉండగానే, పోలీసుల సమక్షంలోనే అంత ఘోరంగా టీడీపీ గూండాలు బరి తెగించి నేరాలకు పాల్పడుతుంటే, సంబంధిత దృశ్యాలు సిసి టీవీ కెమెరాల ద్వారాను, సోషల్ మీడియా ద్వారాను ప్రజలకు తెలుస్తుంటే ముఖ్యమంత్రికి, సీనియర్ అధికారులకు తెలియడం లేదంటే ఏమని అనుకోవాలి! పైగా అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు.
గత ఐదేళ్లలో పోలీసు అధికారులకు అక్రమ కేసులు పెట్టడానికే సరిపోయిందట.. తప్పులు చేసినవారిని వదలిపెట్టరట. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి టీడీపీ నేతలు ఎంత అరాచకంగా ప్రవర్తించినా కేసులు పెట్టడం తప్పు అని చంద్రబాబు చెబుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు పెట్టినవన్నిటినీ తప్పుడు కేసులు అని సీఎం ఎలా ప్రకటిస్తారు? వాటిలో అనేకం కోర్టులలో విచారణలో ఉన్నాయి కదా! నిజంగా అక్రమ కేసులు అయితే ఏ రకంగానో తెలిపి ఆ కేసులను ఎత్తివేయాలని అనుకుంటున్నారా? ఒకవేళ ఎక్కడైనా ఒకటి, అలా జరిగితే, ఆ కేసుల గురించి వివరించి అవి ఎలా తప్పుడివో చెబితే పోలీసు అధికారులు అర్థం చేసుకుంటారు. అలా కాకపోతే పోలీసు వ్యవస్థ పనిచేయగలుగుతుందా? అప్పుడు వైఎస్సార్‌సీపీవారు తప్పు చేసినా, ఇప్పుడు టీడీపీ వారు తప్పు చేసినా ఉదాసీనంగా ఉండనవసరం లేదని చెప్పి ఉంటే చంద్రబాబు సీనియారిటీకి అర్థం ఉండేది.
2014 టరమ్‌లో అమలు చేసిన సిసిటీవీ పుటేజీలను 2019 టరమ్‌లో వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాడుకోలేదట. ఏ పుటేజీ అయినా అవసరాన్ని బట్టి వాడతారు. ఒకవేళ అలా వాడకపోతే ముఖ్యమంత్రో, మంత్రో బాధ్యులవుతారా? లేక సంబంధిత పోలీసు అధికారులు బాధ్యులు అవుతారా? వారినే ఎదురుగా పెట్టుకుని ఎవరిని తప్పు పడతారు! ఆ మాటకు వస్తే గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట పుటేజీ కనిపించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి ఎవరినైనా బాధ్యులుగా చేసి చంద్రబాబు ప్రశ్నించి ఉండవచ్చు కదా! ఒకదానికి, ఇంకోదానికి పొంతన లేకుండా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే. అలాగే ఒకసారేమో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని అంటారు. ఇంకోసారేమో ఈ రెండు నెలల్లో హత్యలు, హింసాకాండ జరిగినా, అవేమీ పెద్ద లెక్కలోనివి కానట్లు ఆయనే మాట్లాడతారు. వాటిని అరికట్టాలని మాత్రం స్పష్టంగా చెప్పరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని యాగీ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు ఎంత పెద్ద ఘోరం జరిగినా అసలు కనిపిస్తున్నట్లే లేదు.
అప్పట్లో సోషల్ మీడియాలో ఎంత అరాచకపు ప్రచారం జరిగినా సమర్థించిన ఆయన, ఇప్పుడు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ సోషల్ మీడియాలో మాట్లాడకూడదన్నట్లు ప్రసంగాలు చేస్తున్నారు. ఈ కారణాలవల్ల పోలీసు ఉన్నతాధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఏపీలో ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో పనిచేయడం అంటే ఒక పెద్ద శాపం అనుకునే విధంగా పరిణామాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి టీడీపీ గూండాల హింసాకాండలో గాయపడ్డవారిని పరామర్శించి స్పష్టమైన హెచ్చరికను పంపించారు. ఇప్పుడు ఇలాగే ప్రభుత్వం పనిచేస్తే, పోలీసులు నిష్క్రియాప్రియత్వంగా వ్యవహరిస్తే, తదుపరి వచ్చే తమ ప్రభుత్వం కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటారని అన్నారు. తమ పార్టీవారు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ముఠాకక్షల ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి జనం ప్రశ్నించకూడదనే ఇలాంటి భయానక వాతావరణాన్ని ఏపీలో సృష్టించారని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది నిజమేనేమో అనిపిస్తుంది. కూటమి నేతలకు తమ హామీలపై చిత్తశుద్ది లేదని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. వారు చేసిన వాగ్ధానాలను వారే మర్చిపోయినట్లు నటిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఇప్పుడు మరో రకంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయినా జనాన్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నట్లుగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇదే తీరున చంద్రబాబు ప్రభుత్వ పాలన కొనసాగితే, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు జనాగ్రహాన్ని తట్టుకోలేని స్థితి ఎదురవుతుంది. ఇప్పటికే జనంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిన తీరును అంతా గమనిస్తున్నారు. అదే విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒకటికి, రెండుసార్లు ప్రభుత్వానికి చెబుతున్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం కాని, టీడీపీ నేతలు కాని ఇలాగే విధ్వంస పాలన చేస్తే, హింసాకాండతో, రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయపెట్టాలని చూస్తే అది ఎల్లవేళలా జరిగేదికాదని గుర్తించాలి. ఎందుకంటే గదిలో వేసి కొడితే పిల్లి అయినా ఎదురుతిరుగుతుందన్న సంగతి చంద్రబాబు వంటి సీనియర్ నేతకు తెలియకుండా ఉంటుందా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment