
ఉండి టీడీపీ అసమ్మతి నేత శివరామరాజు
సాక్షి, భీమవరం: రానున్న ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అసమ్మతి నేత వేటుకూరి శివరామరాజు స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేసేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న తన పట్ల చంద్రబాబు తీరు కలచివేసిందన్నారు.
టీడీపీ అధిష్టానం తీరుతో కలతచెందిన శివరామరాజు మంగళవారం భీమవరంలోని తన కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన ఫ్లెక్సీలను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని.. అధిష్టానం ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందానన్నారు. ఉండి నుంచి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
టీడీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అభ్యర్థి ఎంపిక విషయంలో తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. పదిహేను రోజులుగా పార్టీ నాయకత్వం కనీసం పట్టించుకుకోలేదన్నారు. అనుచరుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.