
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాశస్త్యమైన మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టు వ్రస్తాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్లాదకర వాతావరణం మధ్య క్యాంప్ కార్యాలయం నుంచి ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆలయం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పరివేష్టితం నిర్వహించారు. పరివేష్టితం ధారణతో అమ్మ వారి పట్టువ్రస్తాలు, పసుపు, కుంకుమలను ముఖ్యమంత్రి తలపై పెట్టుకుని మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అంతరాలయంలో శ్రీసరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మ వారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు సీఎం వైఎస్ జగన్‌ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అమ్మవారి తీర్థ ప్రపాదాలు, చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాల రాజు, దేవదాయ కమిషనర్ సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, కల్పలతా రెడ్డి, ఎండీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, కనకదుర్గ ఆలయం చైర్మన్ కర్నాటి రాంబాబు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరి గౌతంరెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్షి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఆలయ ఈవో కెఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు.