
కురుబ లింగమయ్యపై దాడి చేసిన టీడీపీ నేతలు
తలకు బలమైన గాయం... చికిత్స పొందుతూ మృతి
సాక్షి టాస్క్ ఫోర్స్/అనంతపురం ఎడ్యుకేషన్: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య (56)ను టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు దారుణంగా హత్య చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన టీడీపీ నేతలు ఆదివారం రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో లింగమయ్యతో పాటు అతని ఇద్దరు కుమారులపై దాడి చేశారు. ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
చిన్న కుమారుడు శ్రీనివాసులు ముఖంపైనా బలమైన గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు... రామగిరి ఎంపీపీ ఉపఎన్నిక నేపథ్యంలో 2 రోజుల క్రితం పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత జయచంద్రారెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువులైన ధర్మవరపు రమేశ్ కుటుంబ సభ్యులు రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో జయచంద్రారెడ్డి ఊర్లో లేరు. కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇలా ఇంటిపై దాడి చేయడం తగదని, జయచంద్రారెడ్డి రాగానే సామరస్యంగా మాట్లాడుకుందామని వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య వారికి సర్దిచెప్పి పంపేశారు. దీన్ని పరిటాల బంధువులు జీర్ణించుకోలేకపోయారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారనే కారణంతో లింగమయ్య కుటుంబంపై కక్ష పెంచుకున్నారు.
ఆదివారం లింగమయ్య పెద్దకుమారుడు మనోహర్ బైక్‌పై అత్తారింటికి వెళుతుండగా.. దారిలో ధర్మవరపు రమేశ్, ఆదర్శ్, అభిలా‹Ù, నాయుడు, నవకాంత్, రామానాయుడు, మాదిగ సురేశ్ రాళ్ల దాడి చేశారు. ఆ దాడి నుంచి తప్పించుకుని ముందుకెళ్లిన మనోహర్..తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. అంతలోనే వారు మరో పది మందితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో వచ్చి ఇంట్లో ఉన్న లింగమయ్య, చిన్న కుమారుడు శ్రీనివాసులుపై దాడి చేశారు.
ఈ దాడిలో లింగమయ్య తలకు బలమైన గాయమై చికిత్స పొందుతూ మృతి చెందాడు.కాగా, పరిటాల శ్రీరామ్ అభయంతోనే లింగమయ్య హత్య జరిగిందని రాప్తాడు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల పరిటాల శ్రీరామ్ పాపిరెడ్డిపల్లిలో మాట్లాడుతూ మండలానికి ఒకడిని చంపితే కానీ వైఎస్సార్‌సీపీ వాళ్లకు భయం పుట్టదని అన్నారని గుర్తు చేశారు. వారి అరాచకాలకు రామగిరి ఎస్ఐ ఏకపక్షంగా మద్దతు తెలుపుతున్నాడని ఆరోపించారు.