
సాక్షి టాస్క్ ఫోర్స్: హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పీఏలు ప్లాన్ చేశారు. ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. సుమారు 20 వేల మందితో సభను నిర్వహించాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అందిని కాడికి దోచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
భారీగా వసూళ్లకు ప్లాన్?
బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పీఏలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనుకేసుకునేలా పథకం రచించారంటున్నారు. జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పుతున్నారు.
టీడీపీ నేతలకు ఆఫర్లు
ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు. భూఆక్రమణలకు కూడా అవకాశం కలి్పస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం. వేలంలో అమ్మినట్లు పదవులను అమ్మకానికి పెట్టారంటున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి. మద్యం బెల్టు షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నరని చెబుతున్నారు.
ఆ నలుగురిపై భారం
హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం. వారు కూడా భారీ మొత్తంలో పీఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది. కొట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పీఏలు ఒకే చెప్పడంతో అందుకోసం రూ. 20 లక్షలు సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం. అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, మట్టి, ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ కోసం అంటూ అందినకాడికి దోచేయాలని పీఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది.
మండల పరిషత్ నిధులకు ఎసరు!
నియోజకవర్గంలోని మండల పరిషత్ నిధులను ఎమ్మెల్యే పీఏలు భారీగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. చేయని పనులకు లక్షల రూపాయలు ఒక్కో మండలం నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఈ నగదు అంతా ఎమ్మెల్యే పీఏల ఖాతాలకు అక్రమంగా మళ్లించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ పనుల్లో కూడా చేసిన పనులకే లక్షలాది రూపాయలు బిల్లులు మంజూరు చేయించుకొని సభకు మళ్లిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు అందరూ వైఎస్సార్‌సీపీకి సంబంధించిన వారే అయినా అభివృద్ధి పనులంటూ వారితో నిధులకు ఆమోదం తీసుకోవడం, ఆ నిధులను మళ్లించడం వంటివి గుట్టుగా కానిచ్చేశారని చెబుతున్నారు.
ఖర్చు తక్కువ.. వసూళ్లు ఎక్కువ
బాలకృష్ణ అభినందన సభ కోసం 20 వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని తెలిసింది. ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ 6 నుంచి 7 వేల మందికి మిందని... మరి ఎలా 20 వేల మంది సభకు ఎలా తరలిస్తారన్న విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్యే చర్చ సాగుతోంది. 20 వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తువేశారని అంటున్నారు.
వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకేనా?
బాలకృష్ణ ఇలాకాలో పీఏల వసూళ్లు తారాస్థాయికి చేరాయి. ముగ్గురు పీఏల్లో ఒకరు వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకు చేరుస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అవినీతికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. సహజ వనరులు, ప్రజల సొమ్మును స్థానిక సమస్యలకు వాడకకుండా పీఏలు సొంత జేబులు నింపుకోవడానికే వాడుతున్నారన్న విమర్శలున్నాయి.