
పీలేరులో భారీ చోరీ
పీలేరు : పీలేరు పట్టణంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిరుపతి మార్గంలో శ్రీ చౌడేశ్వరి చేనేత నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, అశోక్‌కుమార్‌ల ఇళ్లు రెండు పక్కపక్కనే ఉన్నాయి. ఇరు కుటుంబాలు సోమవారం సాయంత్రం ఇళ్లకు తాళాలు వేసుకుని మదనపల్లెకు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు రాత్రి సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. రెండు ఇళ్లలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశారు. దుండగులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఆలస్యంగా గ్రహించిన బాధితులు దగ్గరలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే దుండగులు ఉడాయించారు. సోమవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ లోకేష్, వేలిముద్ర నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రెండిళ్లలో సుమారు రూ. 10 లక్షల నగదు, అర కిలోకు పైగా బంగారు నగలు, మూడు కిలోల వెండి చోరీ అయినట్లు తెలిపారు.
లక్కిరెడ్డిపల్లెలో..
లక్కిరెడ్డిపల్లె : మండలంలోని చౌటపల్లి పంచాయతీ రవీంద్ర నగర్‌లోని ఓ దుకాణంలో సోమవారం అర్థరాత్రి దొంగలు దుకాణంలోని రేకులు తొలగించి లోనికి చొరబడి రూ. 45 వేలు విలుగల సిగరేట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, విలువైన వస్తువులను దొంగిలించినట్లు బాధితుడు పవన్ కుమార్ తెలిపారు. దుకాణంలో నాలుగు సీసీ కెమెరాలు అమర్చామని అయినా సోమవారం అర్థరాత్రి 1.30 గంటలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి దుకాణంలోకి చొరబడి వస్తువులతోపాటు రూ. 5 వేలు నగదును ఎత్తుకెళ్లారన్నారు. అలాగే దక్కన్ టీ స్టాల్‌లో సిగరేట్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్, రూ. 40 వేలు వస్తువులను అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఈ రెండు దుకాణాల్లోనూ ఒకే రీతిలో చోరీలు జరగడం గమనార్హం.

పీలేరులో భారీ చోరీ