
సారూ.. తాగునీరేది?
● డీహైడ్రేషన్ ప్రమాదం
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో దాహం ఎక్కువగా వేస్తుంది. అందుబాటులో నీరు లేకపోతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. ఇందుకోసం విద్యాశాఖ జలగంట కార్యక్రమం అమలు చేస్తుంది. ఇంటి నుంచి నీళ్ల సీసా తెచ్చుకుంటున్న చిన్నారులకు అది పూర్తయితే మళ్లీ పట్టుకునే వీలులేకుండా పోయింది. ఆర్‌ఓ ప్లాంట్లు వినియోగంలోకి తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
భానుడు భగభగమంటున్నాడు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల దాహం పెరుగుతోంది. తాగడానికి నీరు ఉండటం లేదు. అనేక స్కూళ్లలో ఇంటి నుంచి తాగేందుకు నీరు తెచ్చుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఉన్నా.. నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. మరికొన్ని స్కూళ్లలో తాగునీటి వసతి లేదు. దీంతో విద్యార్థులు దాహంతో అల్లాడుతున్నారు. అయినా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
మదనపల్లె సిటీ: ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే గడప దాటని పరిస్థితి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో గొంతులు తడారి పోతున్నాయి. సరైన సమయానికి మంచినీరు తాగకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో ఉదయం 10, 11, 12 గంటలకు జల గంట మోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలవుతున్నా.. సర్కారు పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్ల మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న నీటి బాటిళ్లు ఒక్కసారిగా ఖాళీ అవుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ పాలనలో
ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు శుద్ధ జలం అందేది. ఆర్‌ఓ ప్లాంట్లు విద్యార్థులకు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. నాడు–నేడు మొదటి విడతలో 600 పాఠశాలలు, రెండో విడతలో 1016 పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో సుమారు 1000 వరకు ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా మారాయి. కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
తూతూ మంత్రంగా..
పాఠశాల్లో నీటి గంట(వాటర్‌బెల్) కన్పించడం లేదు. ఆర్‌ఓ ప్లాంట్లు పని చేయకపోవడంతో.. విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు మొదటి గంటకే పూర్తవుతున్నాయి. దీంతో వాటర్ బెల్ కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగిస్తున్నారు.
అంత నీరు తాగాల్సిందే
వైద్యనిపుణుల సూచనల ప్రకారం .. ఒకటి నుంచి మూడేళ్లలోపు పిల్లలు రోజుకు 1.3 లీటర్లు, 4 నుంచి ఆరేళ్లలోపు 1.7 లీటర్లు, ఐదు నుంచి 13 ఏళ్ల లోపు 2.4 లీటర్లు, 13 ఏళ్లు పైబడిన వారు 3 నుంచి 4 లీటర్లు తాగాలని చెబుతున్నారు. విద్యార్థులు కచ్చితంగా ప్రతి గంటన్నరకు ఒకసారి 100 ఎంఎల్ నీటిని తాగాలి. సరైన మోతుదులో నీరు శరీరంలో లేకుంటే అలసట, బాలికలకు మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు రావడం, కాళ్లునొప్పి, ఇతర సమస్యలు తలెత్తడం, ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది.
జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు:1734
ప్రాథమికోన్నత పాఠశాలలు: 162
ఉన్నత పాఠశాలలు: 304
విద్యార్థులు: 1,54,784
ఆర్వో ప్లాంట్ల వివరాలు
మొదటి విడత: 600 పాఠశాలలు
రెండవ విడత: 1016 పాఠశాలలు
ప్రస్తుతం పని చేయని
ఆర్వో ప్లాంట్లు: సుమారు 1000
ఫిర్యాదు చేశాం
ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేసిన వారికి ఫిర్యాదు చేశాం. ఇప్పటికే చాలా పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు పని చేయడం లేదు. సాంకేతిక సిబ్బంది రావడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –ప్రభాకర్‌రెడ్డి,
మండల విద్యాశాఖ అధికారి, మదనపల్లె
పాఠశాలల్లో మోగని నీటి గంట
పని చేయని ఆర్వో ప్లాంట్లు
గంటకే ఖాళీ అవుతున్న సీసా నీరు
దాహార్తితో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

సారూ.. తాగునీరేది?

సారూ.. తాగునీరేది?

సారూ.. తాగునీరేది?