
తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి
బాపట్ల: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డీఈలు, రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వాటర్ ట్యాంకులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ల వివరాలు, నీటి నిల్వలపై కలెక్టర్ ఆరా తీశారు. జిల్లాలో కెడబ్ల్యూడీ కింద 75 వాటర్ ట్యాంకులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వాటిలో 53 ట్యాంకులు 90 శాతం, 15 ట్యాంకులు 20 – 50 శాతం, 7 ట్యాంకులు 25 శాతంలోపు నీళ్లు కలిగి ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకుగాను బాపట్లలో 33 శాతం, రేపల్లెలో 44 శాతం, చీరాలలో 73 శాతం నీటి నిల్వలు ఉన్నాయని కృష్ణ పశ్చిమ డెల్టా ఎస్‌ఈ వెంకట్ రత్నం వివరించారు. ఎన్‌ఎస్‌పీ కింద జిల్లాలో 40 ట్యాంకులు ఉన్నాయని చెప్పారు., వాటిలో నీరు 45 రోజులపాటు సరిపోతాయని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు తెలిపారు. బాపట్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోని నీరు వారంపాటు అవసరాలకు మాత్రమే సరిపోతుందని, రేపల్లెలో నీరు నెలపాటు, చీరాలలోని నీరు 120 రోజులపాటు అవసరాలకు సరిపోతుందని మున్సిపల్ కమిషనర్లు వివరించారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు నీరు అవసరం ఉన్నందున కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆ నీటిని పశ్చిమ డెల్టాకు విడుదల చేసిన మూడు రోజుల తరువాత బాపట్లకు వస్తాయని, పశ్చిమ డెల్టాకు 15 రోజులపాటు నీరు విడుదల జరుగుతుందని అధికారులు తెలిపారు. నీరు బాపట్లకు చేరిన తర్వాత ఎప్పటికప్పుడు ట్యాంకులను నీటితో నింపాలన్నారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఏఈలు, డీఈలు, వీసీ ద్వారా రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు, అద్దంకి, రేపల్లె మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
నీటి తీరువా వసూళ్లు పెంచాలి
బాపట్ల: గత బకాయిలతో కలిపి నీటి తీరువా రూ.15.46 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రూ.2.26 కోట్లు మాత్రమే వసూలు చేయడమేంటని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రశ్నించారు. రెవెన్యూ అంశాలపై ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులను చైతన్యపరచి నీటి తీరువా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. నివాస భూమి లేని పేదలందరికీ ఇంటి స్థలం పంపిణీకి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు.
నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక
జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి
కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి
నీటి విడుదలకు ఆదేశం